ఎస్‌‌ఎల్‌‌బీసీ పనులు స్పీడప్..! రోజూ 7 మీటర్ల చొప్పున బ్లాస్టింగ్

ఎస్‌‌ఎల్‌‌బీసీ పనులు స్పీడప్..! రోజూ 7 మీటర్ల చొప్పున బ్లాస్టింగ్
  •     రోజూ ఇన్​లెట్​, ఔట్​లెట్​ వైపు నుంచి 7 మీటర్ల చొప్పున బ్లాస్టింగ్​ 
  •     ప్రత్యేకంగా టన్నెల్​ డివిజన్​.. రెండు సబ్​ డివిజన్ల ఏర్పాటు
  •     ఏప్రిల్ తొలి వారంలో డ్రిల్లింగ్, బ్లాస్టింగ్​కు కీలక 
  • ఎక్విప్​మెంట్స్ వచ్చే చాన్స్​
  •     ప్రతి వారం టన్నెల్ పనులపై మంత్రి ఉత్తమ్ రివ్యూలు 

హైదరాబాద్, వెలుగు: ఎస్‌‌ఎల్‌‌బీసీ ప్రాజెక్ట్ టన్నెల్ పనులు వేగంగా సాగుతున్నాయి. టన్నెల్ బోరింగ్ మెషీన్ (టీబీఎం) ద్వారా పనులు సాధ్యం కాకపోవడంతో ప్రభుత్వం డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ పద్ధతిని అవలంబించింది. గత నెల 17న ఔట్‌‌లెట్ వద్ద పనులు పునఃప్రారంభించగా, ఇప్పటివరకు 80 మీటర్ల మేర తవ్వకం పూర్తి చేశారు. ఈ నెల 19న ఇన్‌‌లెట్ వద్ద పనులు ప్రారంభించి 10 మీటర్ల మేర తవ్వకం చేపట్టారు. ప్రస్తుతం రోజూ ఇన్‌‌లెట్, ఔట్‌‌లెట్ వైపుల నుంచి 7 మీటర్ల చొప్పున మొత్తం 14 మీటర్ల బ్లాస్టింగ్ లక్ష్యంగా పనులు కొనసాగుతున్నాయి. 

ప్రాజెక్టును 2028 జూన్ నాటికి పూర్తి చేసి నీటిని అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కట్టుదిట్టంగా చర్యలు చేపడుతోంది. పనుల పురోగతిని వేగవంతం చేయడానికి ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నారు. గత ఏడాది ఫిబ్రవరి 22న టన్నెల్ పైభాగం కూలిన ప్రమాదంలో 8 మంది కార్మికులు టన్నెల్‎లోనే సజీవ సమాధి అయ్యారు.  
అందులో ఇద్దరి మృతదేహాలు మాత్రమే వెలికితీయగలిగారు. ఈ నేపథ్యంలో ఇకపై అలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాంగ్రెస్​ ప్రభుత్వం ఏర్పడ్డాక.. ఎస్​ఎల్​బీసీ టన్నెల్​ ఇన్​లెట్​ వద్ద నుంచి పనులను టీబీఎం మెషీన్​తో ప్రారంభించింది.  

ప్రత్యేక టన్నెల్ డివిజన్ ఏర్పాటు.. 

ఎస్‌‌ఎల్‌‌బీసీ పనుల కోసం ప్రత్యేక టన్నెల్ డివిజన్ ఏర్పాటు చేశారు. ఇన్‌‌లెట్ వద్ద బ్రహ్మగిరి (దోమలపెంట), ఔట్‌‌లెట్ వద్ద దేవరకొండలో రెండు సబ్‌‌డివిజన్లు ఏర్పాటు చేసి, ఇద్దరు ఇంజినీర్లను నియమించారు. రెండు వైపుల పనులను ఈ అధికారులే పర్యవేక్షిస్తున్నారు. ఇక, టన్నెల్​పనుల్లో ఎలాంటి ప్రమాదాలూ జరగకుండా నిపుణులనూ టన్నెల్ వద్ద మోహరిస్తున్నారు. అలాగే, సింగరేణి, జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన  మైనింగ్​ ఇంజినీర్లు, నిపుణులను అక్కడకు తీసుకొచ్చారు. అడుగడుగునా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు.  

ఏప్రిల్ నుంచి మరింత వేగం..

టన్నెల్ పనులను ఏప్రిల్ రెండో వారం నుంచి మరింత వేగవంతం చేయనున్నారు. డ్రిల్లింగ్, బ్లాస్టింగ్‌‌ పద్ధతిలో పనులు చేస్తున్నందున అందుకు కావాల్సిన ఎక్యూప్​మెంట్స్ ఏప్రిల్ తొలి వారంలో వచ్చే చాన్స్​ఉంది. అవి అందుబాటులోకి వచ్చిన తర్వాత రెండో వారం నుంచి పనులు స్పీడప్​కానున్నాయి. ప్రమాద ప్రాంతాన్ని దాటేందుకు టన్నెల్‌‌ను 50 నుంచి 70 మీటర్లు వెనక్కు వచ్చి టన్నెల్​ను డైవర్ట్ చేస్తున్నారు.  

మంత్రి ఉత్తమ్ స్పెషల్​ ఫోకస్​..

టన్నెల్ పనుల పురోగతిపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పెషల్​ ఫోకస్​పెట్టారు. ప్రతి వారం రివ్యూలు నిర్వహిస్తూ పనుల వివరాలను తెలుసుకోవడంతోపాటు పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశిస్తున్నారు. అధికారుల నుంచి నివేదిక తెప్పించకుని పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. నిర్దేశిత గడువులోపు పనులు పూర్తి చేసేందుకు అధికారులు సైతం రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు.