
- ఎన్జీఆర్ఐతో టెస్టులు చేయించాలని నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్ఎల్బీసీ) పనులను జియో ఫిజికల్ టెస్టులు చేసిన తర్వాతే చేపట్టాలని టెక్నికల్ సబ్ కమిటీ స్పష్టం చేసింది. నేషనల్ జియాలాజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్జీఆర్ఐ) ద్వారా ఈ టెస్టులను చేయించనున్నారు. ఓ వైపు సహాయ చర్యలు చేపడుతూనే రెండు మూడు నెలల్లో జియోఫిజికల్ టెస్టులను పూర్తి చేసేలా చర్యలు తీసుకోనున్నారు. శుక్రవారం హైదరాబాద్లోని జలసౌధలో టెక్నికల్ సబ్ కమిటీ సమావేశం జరిగింది.
కన్వీనర్, నల్గొండ సీఈ అజయ్ కుమార్ అధ్యక్షతన నిర్వహించిన ఈ భేటీలో ఇరిగేషన్ శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, ఈఎన్సీ అనిల్ కుమార్, రాక్ మెకానిక్స్ నిపుణుడు నైతాని, సొరంగాల తవ్వకాల్లో ఎక్స్పర్ట్ మోరె రాములు, ఎన్జీఆర్ఐ తదితర సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ నుంచి కల్నల్ పరీక్షిత్ మెహ్రా ఆన్లైన్లో సమావేశంలో పాల్గొన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 22న టన్నెల్ 14వ కిలోమీటర్ వద్ద పైకప్పు కూలడంతో 8 మంది అందులో చిక్కుకుపోయారు. ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. మరో ఆరుగురి ఆచూకీ కనుగొనాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే గత నెలలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారు.
జియోఫిజికల్ డేటా, ఇతర అంశాలను స్టడీ చేసేందుకు ఆ కమిటీ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. తాజాగా నిర్వహించిన సబ్ కమిటీ భేటీలో.. ప్రమాదం జరిగిన ప్రాంతంలో టన్నెల్ బోరింగ్ మెషీన్ (టీబీఎం) ద్వారా తవ్వకాలు చేపట్టడం కష్టమని సబ్ కమిటీ నిపుణులు తేల్చినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే డ్రిల్లింగ్, బ్లాస్టింగ్తోనే టన్నెల్ నిర్మాణాన్ని చేపట్టాలని నిర్ణయించినట్టు సమాచారం. ఈ క్రమంలో భూమిపై నుంచి ప్రత్యేక మార్గం (షాఫ్ట్) నిర్మాణానికి పర్యావరణ అనుమతులు క్లిష్టమవుతాయన్న అభిప్రాయాలు వ్యక్తం కాగా.. సొరంగ మార్గంలోనే నిర్మాణ వ్యర్థాలను వెనక్కి తరలించేందుకు నిర్మాణ సంస్థ సానుకూలత వ్యక్తం చేసింది.
20 మీటర్ల పొడవు, 30 మీటర్ల ఎత్తుతో దశలవారీగా బ్లాస్టింగ్ చేయాల్సి ఉంటుందని.. దానికి తగ్గట్టు జియోఫిజికల్ డేటాను తీసుకోవాల్సి ఉంటుందని సబ్ కమిటీ సూచించినట్టు సమాచారం. కాగా, మిగిలిన ఆరుగురి ఆచూకీ కనుగొనేందుకు.. ఒకేసారి శిథిలాలను తొలగిస్తే ప్రమాదమని, కూలిన ప్రాంతంలో ఒక చివరి నుంచి కొంత, మధ్య నుంచి కొంత కొంత తవ్వకాలు చేపడుతూ ముందుకు వెళ్తే బాగుంటుందని రాక్ మెకానిక్స్ నైతాని సూచించినట్టు సమాచారం.