
- నియోజకవర్గంలోని 295 బడులను కార్పొరేట్‌కు ధీటుగా మార్చే ప్లాన్
- రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా ఇదే విధానం అమలు చేసే యోచన
- పైలట్ ప్రాజెక్టు కింద కొడంగల్ ఎంపిక
- సర్కారుకు స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ల ప్రపోజల్స్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో విద్యాపరంగా అత్యంత వెనుకబడిన కొడంగల్ నియోజకవర్గంలోని ప్రభుత్వ స్కూళ్లకు మహర్దశ పట్టనుంది. సెగ్మెంట్ పరిధిలోని 295 సర్కార్ బడులను కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా మార్చేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా ఈ విధానాన్ని అమలు చేసేందుకు వీలుగా పైలట్ ప్రాజెక్టు కింద కొడంగల్‌ను ఎంపిక చేశారు. మౌలిక వసతులతో పాటు డిజిటలైజేషన్ ప్రక్రియకు సంబంధించిన ప్రపోజల్స్‌ను స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు సర్కారుకు పంపించారు.
సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం నారాయణపేట, వికారాబాద్ జిల్లాల్లో విస్తరించి ఉంది. వీటిలో నారాయణపేట జిల్లాలో 126 ప్రభుత్వ స్కూళ్లు, ఒక మోడల్ స్కూల్, రెండు కేజీబీవీలు ఉన్నాయి. వికారాబాద్‌లో 163 ప్రభుత్వ, మూడు కేజీబీవీలు ఉన్నాయి. వీటన్నింటిలో 25,469 మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే, కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం విద్యారంగంలో చాలా వెనుకబడి ఉంది.
ఇక్కడి స్కూళ్లలో పిల్లలు ఎక్కువ మందే ఉన్నా.. ఎఫ్‌ఎల్‌ఎన్, ఎల్‌ఐపీ నివేదికల ప్రకారం అటెండెన్స్ తక్కువగా ఉంది. లర్నింగ్ ఔట్ కమ్స్ కూడా సరిగా రావడం లేదు. దీంతో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకొని విద్యా రంగాన్ని బాగు చేస్తే, ఏ స్కూల్‌కు ఏది అవసరమో తెలుసుకుని ఆ పని చేయడానికి వీలవుతుందని అధికారులు భావిస్తున్నారు. తద్వారా నిధులు అలాట్ కావడంతో పాటు ఆ సెగ్మెంట్‌లోని ప్రజాప్రతినిధులు ప్రత్యేకంగా దృష్టి పెడుతారనే భావన ఉంది. ఇందులో భాగంగా చదువులో వెనుకబడిన కొడంగల్ సెగ్మెంట్‌ను అధికారులు ఎంచుకున్నారు. ఇందులో స్కూళ్ల వసతులను మెరుగుపర్చడంతో పాటు క్లాస్ రూమ్‌లను డిజిటల్‌గా మార్చాలని నిర్ణయించారు. అన్ని ప్రైమరీ స్కూళ్లకు అనుబంధంగా ప్రీప్రైమరీ క్లాసులనూ ప్రారంభించాలని డిసైడ్ అయ్యారు.
రూ.30 కోట్లతో విద్యా శాఖ అంచనాలు..
కొండగల్‌లోని అకాడమిక్ అంశాలకు సంబంధించిన ఏర్పాట్ల కోసం రూ.30 కోట్లతో స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వీటిని ఇటీవలే విద్యాశాఖ సెక్రటరీ యోగితా రాణాకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ పంపించారు. అకాడమిక్ అంశాలను సమగ్ర శిక్ష నిధులతో పూర్తి చేయనున్నారు. మిగిలిపోయిన సివిల్ వర్క్స్‌ను కొడంగల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ(కడ) ద్వారా చేయనున్నారు. ఇంకొన్ని ఉపాధి హామీ పథకం, కలెక్టర్ నిధులతోనూ చేపట్టేలా ప్లాన్ రెడీ చేశారు. ఈ క్రమంలో ఏ స్కూల్‌కు ఏం కావాలనే దానిపై అంచనాలను సర్కారుకు ప్రతిపాదించారు. ఇది సక్సెస్ అయితే, అన్ని సెగ్మెంట్లలోనూ దశల వారిగా ఇలాంటి కార్యక్రమాలే నిర్వహించాలని అధికారులు యోచిస్తున్నారు.
బడుల్లో ఇవి చేయనున్నారు..
- అన్ని బడుల్లో కంప్యూటర్ ల్యాబ్స్‌ను ఏర్పాటు చేయడం, ఇంటర్నెట్ కనెక్షన్ అందించడం
- ప్రతి స్కూల్‌లో సైన్స్ ల్యాబ్ ఏర్పాటు, ఫర్నిచర్, ల్యాబ్ పరికరాలు అందజేయడం
- అన్ని హైస్కూళ్లు, అప్పర్ ప్రైమరీ స్కూళ్లకు లైబ్రరీలకు ఫర్నిచర్ అందించడం, ఆయా స్కూళ్లలో రెండు స్పోర్ట్స్ కోర్టుల ఏర్పాటు
- అన్ని బడుల్లో స్కౌట్స్ అండ్ గైడ్స్ యూనిట్ల ఏర్పాటు, విద్యార్థులందరికీ ఒక జత బూట్లు, 2 జతల సాక్స్ అందించడం
- ఆయా సెగ్మెంట్‌లోని స్టూడెంట్లు, సిబ్బందికి ఐడీ కార్డులు
- అన్ని బడుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం, వీటిని అనుసంధానిస్తూ ‘కడ’ ఆఫీసు, కలెక్టరేట్, డీఈఓ ఆఫీసుల్లో మినీ వీఎస్‌కేల ఏర్పాటు
- అన్ని హైస్కూళ్లలో ఒకేషనల్ కోర్సుల ప్రవేశం, ఐఐటీ, నీట్ ఫౌండేషన్ కోసం స్టడీ మెటీరియల్ అందించడం
ఇవి కావాలి..
వసతులు స్కూళ్లు
బాయ్స్ టాయిలెట్స్ 57
గర్ల్స్ టాయిలెట్స్ 29
టాయిలెట్స్మరమత్తులు 31
ఎలక్ట్రిసిటీ కనెక్షన్లు 22
కంపౌండ్ వాల్ 163
ఇంటిగ్రేటెడ్
సైన్స్ ల్యాబ్ గది 30
అడిషనల్ క్లాస్ రూమ్స్ 144
హెడ్మాస్టర్ రూమ్‌లు 23
స్కూల్ గ్రౌండ్
లెవెలింగ్ 121