నత్తనడకన భగీరథ పనులు

నత్తనడకన భగీరథ పనులు

ఇంటింటికీ తాగునీళ్ళు అందించేందుకు ఉద్దేశించిన మిషన్ భగీరథ పథకం పనులు ఉమ్మడి వరంగల్ జిల్లాలో నత్తనడకన సాగుతున్నాయి. 6 జిల్లాల్లోని 1709 గ్రామాల దాహార్తి తీర్చడానికి గోదావరి జలాలను అందించేందుకు… 4,433 కోట్లతో 2016లో పనులు చేపట్టింది ప్రభుత్వం. ఇంటెక్ వెల్ పంపులు, పంపు హౌజ్ ల నిర్మాణం పూర్తి చేసారు. వీటికి కనెక్షన్ ఇవ్వడానికి పైప్ లైన్ పనులు చేపట్టారు. అయితే ఇవి తరుచుగా పగులుతుండటంతో నీరు కలుషితమవుతోంది. కొన్ని చోట్ల అసలు భగీరథ నీళ్ళే సరఫరా కాకపోవడంతో… జనం చేద బావులను ఆశ్రయిస్తున్నారు.మరి కొందరు హ్యాండ్ పంపుల నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు.

ఉమ్మడి వరంగల్ జిల్లాలకు చెందిన మంత్రులు ఎర్రబెలి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ జిల్లాలోనూ పనులు సాగడం లేదు. మంత్రులు, ఉన్నతాధికారులు మిషన్ భగీరథ పనుల పేరుతో రివ్యూలు నిర్వహించడమే తప్ప పనుల సంగతి పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. వరంగల్ రూరల్ జిల్లా లోని కొండాపురం, గణేష్ నగర్ , మురళీనగర్ కు పైప్ లైన్ పనులను అటవీశాఖ అధికారులు అడ్డుకున్నారు. కొండాపురం, కన్నరావుపేట, బుచ్చిరెడ్డిపల్లె, రేలకుంట గ్రామాలకు అసలు నీటి సరఫరాయే జరగడం లేదు.

భగీరథకి కొత్త పైప్ లైన్లు వేస్తామంటూ… ప్రస్తుతం ఉన్న పైప్ లైన్లు తవ్వేయడంతో…చాలా గ్రామాల్లో నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. నర్సంపేట రూట్ లో 688 కిలోమీటర్ల ట్రాన్స్ మిషన్ పైపులైన్లు, 686 ఇంట్రా పైపులైన్లు వేయాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. పరకాల నియోజక వర్గంలో 566 కిలోమీటర్ల ట్రాన్స్ మిషన్ , 697కి.మీ ఇంట్రా పైపులైన్లు వేయాలి. వరంగల్ రూరల్ జిల్లాలో 490 ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణం పనులు 2017లో మొదలైనా ఇప్పటికీ 70 శాతం కూడా పూర్తి కాలేదు. వరంగల్ నగరంలోనూ భగీరథ పనులు ఇంకా పూర్తి కాలేదు. ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ దగ్గర ట్యాంక్ నిర్మాణం పూర్తయినా అది అలంకారంగా మారింది. హన్మకొండలో పెద్దమ్మగడ్డ ప్రాంతంలో నల్లాలకు కనెక్షన్ ఇవ్వక పోవటంతో.. నీరు సరఫరా లేదు. దాంతో ఇళ్ల ముందు పైపులైను రెండు నెలలుగా నిరుపయోగంగా ఉన్నాయి.

వరంగల్ రూరల్ జిల్లాలో నీటితో శరీరంపై దురదలు, దద్దులు వస్తున్నాయంటూ తాగటం మానేసారు. జనగామ జిల్లాలో మూడొంతుల ప్రజలు ఈ నీటిని తాగడానికి నిరాకరిస్తున్నారు. కలుషిత నీరు తాగలేక ఇప్పటికీ బయట ఫ్యూరిఫైడ్ వాటర్ కొనుక్కొంటున్నారు. మిషన్ భగీరథ నీళ్ళు వద్దంటూ ఆందోళన చేపట్టడంతో సరఫరా నిలిపివేశామని అధికారులే చెబుతున్నారు. వరంగల్ శివారు గ్రామాల్లో నాలుగు రోజులకోసారి నల్లా నీళ్ళు వస్తున్నాయి. పూర్తిగా ఎండాకాలం రాక ముందే ఈ పరిస్థితి ఉంటే… రాబోయే రోజుల్లో తమకు నీటి కష్టాలు తప్పవంటున్నారు మహిళలు.

వరంగల్ రూరల్ తో పాటు మహబూబాబాద్ జిల్లాలోని 5 మండలాలకు మిషన్ భగీరథ ప్రాజెక్టు కింద 995 కోట్ల రూపాయల ఖర్చుతో 775 ఇళ్ళకి తాగునీరు అందించేందుకు మూడేళ్ల కిత్రం పనులు మొదలయ్యాయి. నర్సంపేట, పరకాల, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో ఇప్పటి పూర్తి కాలేదు. పైపులు వేశారే కానీ నీళ్ళు రావట్లేదు. వరంగల్ జిల్లాలో చాలా గ్రామాల్లో గతంలో నిర్మించిన వాటికే మిషన్ భగీరథ పెయింట్స్ వేసి కొత్తగా నిర్మించినట్టు బిల్లులు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి.

మహబూబాబాద్ జిల్లాలోని అయోధ్య పురంలో భగీరథ నీళ్ళు తాగితే దద్దులు వస్తున్నాయని గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. ప్రజలు ఆ నీటిని తాగటం మానేసారు. మహబూబాబాద్ పట్టణంలో కూడా ఇప్పటికీ మిషన్ భగీరథ పనులు పూర్తి కాలేదు. కొన్ని గ్రామాలకు కొత్త పైప్ లైన్లను కాంట్రాక్టర్లు ఫీటు లోతులోనే వేయడంతో నీటి ఉధృతికి ఎక్కడిక్కడే పైపులు పగిలి లీకేజీలు ఏర్పడుతున్నాయి.

పగిలిన పైపులకు మరమ్మత్తులు చేయక పోవటంతో కలుషితమైన నీరు పైపులోకి చేరుతోంది. ఆ నీటిని తాగడానికి జనం ఇబ్బంది పడుతున్నా… అలాగే వదులుతున్నారు అధికారులు. పైపులకు రిపేర్లు చేయకపోగా… పైప్ లైన్లు కూడా శుభ్రం చేయట్లేదని జనం ఆరోపిస్తున్నారు.

మిషన భగీరథ పథకంతో అన్ని గ్రామాలకు నీళ్ళు సరఫరా అవుతున్నాయనీ…. పైపులు పగిలిన చోట రిపేర్లు చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. వాటర్ పంపింగ్ చేసే టైమ్ లో ప్రెషర్ కు పైపులు పగులుతున్నది నిజమే అంటున్నారు
మిషన్ భగీరథ పనులపై అధికారులు నిర్లక్ష్యం వీడకపోతే… ఎండాలకంలో జనం తాగునీళ్ళకి ఇబ్బందులు తప్పేలా లేవు. తొందరగా ట్యాంకులు, పైప్ లైన్స్ పనులు పూర్తి చేసి… దాహార్తి తీర్చాలని జనం కోరుతున్నారు.