
‘పిట్ట కథ’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన బ్రహ్మాజీ కొడుకు సంజయ్ రావు నటించిన మరో సినిమా ‘స్లమ్ డాగ్ హస్బెండ్’. ఏ ఆర్ శ్రీధర్ దర్శకత్వంలో అప్పి రెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి నిర్మిస్తున్నారు. ప్రణవి మానుకొండ హీరోయిన్. అలీ, బ్రహ్మాజీ, సప్తగిరి, రఘు కారుమంచి, యాదమ రాజు, చమ్మక్ చంద్ర ఇతర పాత్రలు పోషిస్తున్నారు. రీసెంట్‌గా ఈ మూవీ ట్రైలర్‌ను హీరో కళ్యాణ్ రామ్ విడుదల చేసి టీమ్‌కి బెస్ట్ విషెస్ చెప్పాడు.
ఇక ట్రైలర్ విషయానికొస్తే.. స్లమ్ ఏరియాలో ఉండే హీరోహీరోయిన్ ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలనుకుంటారు. కానీ వీరి జాతకాలు కలవలేదని, ముందు వేరొకరితో వివాహం జరిపించాలని పురోహితుడు చెప్పడంతో ఓ కుక్కని పెళ్లాడతాడు సంజయ్. ఇక గండం గట్టెక్కడంతో ప్రణవిని పెళ్లి చేసుకునే టైమ్‌కి మొదటి భార్య (కుక్క) బతికుండగానే రెండో పెళ్లి ఎలా చేస్తారని కోర్టులో కేసు వేయడం, విడాకులిచ్చి, ఇరవై లక్షలు భరణం ఇప్పించాలని లాయర్ సప్తగిరి వాదించడం కామెడీగా ఉంటుంది. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తామని దర్శక నిర్మాతలు చెప్పారు.