పావుకిలో బరువుతో పుట్టి..రికార్డు కొట్టి..

పావుకిలో బరువుతో పుట్టి..రికార్డు కొట్టి..

నాలుగున్నర కిలోలకు పైగా పుట్టిన బాల భీముల గురించి చదివి ఉంటాం. ఉండాల్సిన బరువు కంటే తక్కువగా పుట్టిన చిన్నారులను చూసి ఉంటాం. కానీ, పెద్ద ఉల్లిగడ్డంత సై జులో పుట్టిన పిల్లల గురించి వినడం, చదవడం, చూడడం చాలా చాలా అరుదు. జపాన్ లోని కియో యూనివర్సిటీ ఆస్పత్రిలో ఐదు నెలల క్రితం ఓ బుడ్డోడు అలాగే పుట్టాడు. కేవలం 268 గ్రాములతో ఆరు నెలలకే పుట్టేశాడా బుడ్డోడు. కడుపులో సరైన ఎదుగుదల లేకపోవడంతో డాక్టర్లు త్వరగా డెలివరీ చేయాల్సి వచ్చింది. ఆ బుడ్డోడికి ఐదు నెలల పాటు డాక్టర్లు ట్రీట్ మెంట్ ఇవ్వడంతో ఇప్పుడు ఒళ్లు చేశాడు.

3.238 కిలోలకు పెరిగాడు. అత్యంత తక్కువ బరువుతో పుట్టి ఆస్పత్రి నుంచి క్షేమంగా ఇంటికెళ్లిన బుడతడిగా ఆ చిన్నారి రికార్డుకెక్కాడని ఆస్పత్రి డాక్టర్లు చెబుతున్నారు. బుడ్డోడు గట్టోడే అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. అంతకుముందు జర్మనీలో 2009లో 274 గ్రాముల బరువుతో పుట్టిన చిన్నారి పేరిట ఆ రి కార్డు ఉండేదని చెప్పారు. ఇక, అదే జర్మనీలో 2015లో 252 గ్రాములతో ఓ అమ్మాయి పుట్టింది. ఆ అమ్మాయీ క్షేమంగానే ఇంటికి చేరింది.