- భద్రతా సదస్సులో కార్మిక శాఖ ముఖ్యకార్యదర్శి దానకిషోర్
హైదరాబాద్, వెలుగు: పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం వహించకూడదని, భద్రతా చర్యల కోసం వెచ్చించే చిన్నపాటి మొత్తం ఎంతో విలువైన ప్రాణాలను కాపాడుతుందని రాష్ట్ర కార్మిక, ఉపాధి, శిక్షణ మరియు ఫ్యాక్టరీల శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.దానకిషోర్ అన్నారు. ఫ్యాక్టరీల నిర్వహణలో నైపుణ్యాభివృద్ధి (స్కిల్ డెవలప్‌మెంట్) ఎంతో కీలకమని చెప్పారు.
నేషనల్ సేఫ్టీ కౌన్సిల్ (తెలంగాణ చాప్టర్), రాష్ట్ర ప్రభుత్వ ఫ్యాక్టరీల విభాగం, ఎఫ్టీసీసీఐ సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని రెడ్ హిల్స్ లో ‘‘పారిశ్రామిక ఎల్పీజీ, సీఎన్జీ భద్రత ఉత్తమ విధానాలు’’ అనే అంశంపై మంగళవారం సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన దానకిషోర్ మాట్లాడుతూ.. గృహ అవసరాలకు, పారిశ్రామిక రంగానికి ఎల్పీజీ సురక్షిత వినియోగం అత్యంత ముఖ్యమన్నారు. భద్రతా విధానాలను రూపొందించుకుని, వాటిని పక్కాగా అమలు చేయాలని, కాలానుగుణంగా వాటిని సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని వివరించారు.
ప్రభుత్వ రంగ చమురు సంస్థలు పాటిస్తున్న అత్యుత్తమ విధానాలను ఎల్పీజీ వినియోగించే ఇతర పరిశ్రమలు కూడా ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఫ్యాక్టరీల డైరెక్టర్ వై.మోహన్ బాబు మాట్లాడుతూ.. 2025 సెప్టెంబరులో సేఫ్టీ ప్రొఫెషనల్స్ కోసం ‘శిక్షకులకు శిక్షణ (ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్)’ కార్యక్రమం చేపట్టామన్నారు. త్వరలోనే జిల్లాల వారీగా ఫ్యాక్టరీ ఉద్యోగులకు ఈ భద్రతా శిక్షణా కార్యక్రమాలను విస్తరిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నేషనల్ సేఫ్టీ కౌన్సిల్ తెలంగాణ చాప్టర్ గౌరవ కార్యదర్శి వి.వి.శశికుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
