
నకిలీలు, డూప్లికేట్లకు అడ్డుకట్ట వేయడం, దేశవ్యాప్తంగా ఒకే తరహా ఫార్మాట్, డిజైన్ కోసం కేంద్ర ప్రభుత్వం ‘స్మార్ట్’డ్రైవింగ్ లైసెన్సులను తీసుకువస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో వేర్వేరు మోడళ్లలో డ్రైవింగ్ లైసెన్సులు ఉన్నాయి. తెలంగాణ, ఏపీ తదితర కొన్ని రాష్ట్రాల్లో చిప్ కార్డులు ఉండగా.. యూపీ, బీహార్ వంటి రాష్ట్రాల్లో కేవలం ల్యామినేటెడ్ కార్డులనే వినియోగిస్తున్నారు. దీంతో నకిలీలకు అవకాశం ఎక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలోనే ఒకే తరహా ఫార్మాట్, డిజైన్‌తో స్మార్ట్ కార్డు తరహా డ్రైవింగ్ లైసెన్సులను తీసుకురావాలని కేంద్రం నిర్ణయించింది. ఎన్‌ఐసీ అభివృద్ధి చేసిన సారథి అప్లికేషన్‌లోనే దీన్ని నిర్వహించనున్నారు. డ్రైవింగ్ లైసెన్సులకు కామన్ డేటాబేస్‌ను రూపొందించే పని ఇప్పటికే మొదలుపెట్టినట్టు ఇటీవల కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు.
ఎలా ఉంటాయి?
దేశవ్యాప్తంగా రోజూ సగటున 32 వేల కొత్త డ్రైవింగ్ లైసెన్సులు జారీ చేస్తున్నారు. వారితోపాటు రెన్యువల్ చేసుకునేవారికి కూడా కొత్త కార్డులను అందజేయనున్నారు. ఇవి దేశవ్యాప్తంగా ఒకే ఫార్మాట్, ఒకే కలర్, ఒకే డిజైన్, ఒకేలా సెక్యూరిటీ ఫీచర్స్ తో రూపొందనున్నాయి. కార్డు ధర సుమారు రూ. 20 గా ఉండవచ్చని, కార్డుపై జాతీయ, రాష్ట్ర చిహ్నాలు ఉంటాయని చెబుతున్నారు. ప్రమాద సమయంలో ఉపయోగపడేలా బ్లడ్ గ్రూప్ ను తప్పనిసరిగా చేర్చనున్నారు. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ అభివృద్ధి చేసిన సారథి అప్లికేషన్‌తోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. దేశవ్యాప్తంగా ఎక్కడైనా డ్రైవింగ్ లైసెన్సులను చెక్ చేసుకునేలా కామన్ డేటాబేస్ సిద్ధం చేస్తున్నారు. నకిలీల గుర్తింపు, ఉల్లంఘనలు, చలానాల వివరాలనూ చూసే ఏర్పాట్లు జరుగుతున్నాయి.