
- సంగారెడ్డి జిల్లా చల్లగిద్ది తండాలో ఘటన
నారాయణ్ ఖేడ్, వెలుగు: గంజాయి తనిఖీలకు వెళ్లిన ఎక్సైజ్ అధికారులకు చేదు అనుభవం ఎదురైంది. అంతర పంటగా గంజాయి సాగు చేస్తున్నారన్న సమాచారంతో ఓ తండాకు వెళ్లిన ఆఫీసర్లపై స్థానికులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలంలోని చల్లగిద్ద తండాలో జరిగింది. జిల్లా ఎక్సైజ్, టాస్క్ ఫోర్స్ సీఐ శంకర్ తెలిపిన వివరాల ప్రకారం.. చల్లగిద్దతండాకు చెందిన జానకీరామ్ తన పత్తిచేలో అంతరపంటగా గంజాయిని సాగుచేస్తున్నాడు. ఈ విషయం తెలియడంతో ఎక్సైజ్ సీఐ శంకర్, ఎస్సైలు హన్మంతు, అరుణజ్యోతి, సిబ్బంది ప్రభాకర్, అంజిరెడ్డి తనిఖీలకు వెళ్లారు.
పత్తిలో సాగైన 64 గంజాయి మొక్కలను పట్టుకున్నారు. అనంతరం అదే తండాలో వడిత్యా మోహన్ ఇంట్లో తనిఖీలు చేయగా 4 కిలోల ఎండు గంజాయి, కిలోన్నర గంజాయి సీడ్స్ దొరికాయి. ఈ క్రమంలో అక్కడకు చేరుకున్న తండావాసులు అధికారులను చుట్టుముట్టారు. పిడిగుద్దులతో దాడి చేశారు. వారి సెల్ఫోన్లను లాక్కున్నారు.
అధికారులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఖేడ్ డీఎస్పీ వెంకట్రెడ్డి, కంగ్జి సీఐ దమ్మ వెంకట్రెడ్డి, ఖేడ్ ఎస్సై శ్రీశైలం తండాకు వెళ్లారు. అక్కడ పికెట్ ఏర్పాటు చేసి దాడి చేసిన వారిని గుర్తించేందుకు విచారణ జరుపుతున్నారు.