
హుస్నాబాద్, వెలుగు: సౌదీ అరేబియా రాజధాని రియాద్ లో కొంతకాలంగా చికిత్స పొందుతున్న కోమా పేషెంట్ లోకిని కృష్ణమూర్తిని హైదరాబాద్ తరలించడానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక చొరవ చూపారు. ఫ్లైట్ లో వస్తుండగా.. సోమవారం ఉదయం హైదరాబాద్ కు చేరిన వెంటనే దక్కన్ ఆస్పత్రిలో అడ్మిట్ చేయనున్నారు. హుస్నాబాద్ సెగ్మెంట్ ఎల్కతుర్తికి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ లోకిని కృష్ణమూర్తి (35) గత జులై 23న సౌదీలో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు.
అనంతరం కోమాలోకి వెళ్లిన ఆయనకు రియాద్ లోని ఎస్ఎంసీ ఆస్పత్రిలో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. పేషెంట్ పరిస్థితిపై తండ్రి లోకిని సూరయ్య గత నెల 9న ‘సీఎం ప్రవాసీ ప్రజావాణి’లో వినతిపత్రం అందజేశారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వ ఎన్నారై అడ్వైజరీ కమిటీ వైస్ చైర్మన్ భీంరెడ్డి గైడ్ చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక చొరవ తీసుకోవడంతో తెలంగాణ ప్రభుత్వం సౌదీలోని భారత ఎంబసీని సంప్రదించింది. పేషెంట్ ను రప్పించేందుకు చర్యలు చేపట్టగా.. భర్త కృష్ణమూర్తితో పాటు అతని భార్య అశ్విని సౌదీ నుంచి ఫ్లైట్ లో వస్తున్నారు.