ఒకప్పుడు నీటిని వడబోసుకోవడానికి స్టీల్ వాటర్ ఫిల్టర్లుండేవి. టెక్నాలజీ మారిపోయింది. కరెంట్‌ను వాడుకుంటూ నీటిలోని మలినాలను తొలగించేసే సరికొత్త ఫిల్టర్లు మార్కెట్లోకి పోటెత్తుతున్నాయి. కానీ, మనకు తెలియకుండా సహజంగా నీటిలోని మలినాలను తీసేసి వడబోసే చెట్లు, కీటకాలు, జంతువులు చాలానే ఉన్నాయి. అందులో నత్తలూ ఒకటి. అవును, నత్తలు నీటిని సహజ సిద్ధంగా శుభ్రం చేసేస్తాయని ఫ్రాన్స్‌కు చెందిన తారా ఓషన్ ఫౌండేషన్ చేస్తున్న స్టడీలో తేలింది. ఒక్కో నత్త రోజుకు 25 లీటర్ల నీటిని వడబోసి శుద్ధి చేస్తున్నట్టు సైంటిస్టులు తేల్చారు. స్టడీలో భాగంగా థేమ్స్, ఎల్బ, సీన్ నదుల్లోని నీటి శుద్ధతను నత్తల ద్వారా కొలిచారు.
నత్తలను ఒక వలలో కట్టి నదుల్లోకి వదిలారు. నెల రోజుల తర్వాత వాటిని బయటకు తీసి కోసి చూశారు. వాటి కణాలు, కణజాలాల్లో ఏమేం రసాయనాలున్నాయో కనుక్కున్నారు. నీళ్లలోని బిస్ఫినాల్ ఏ అనే సూక్ష్మ ప్లాస్టిక్, థాలేట్లను అది పీల్చినట్టు తేల్చారు. కాబట్టి నత్త గుల్లలను సహజ సిద్ధమైన వాటర్ ఫిల్టర్లుగా చెబుతున్నారు. నీళ్లలోని రసాయనాలే కాదు, మలం కలిసిన నీటిలోని బ్యాక్టీరియానూ నత్త గుల్లలు పీల్చి, నీటిని శుద్ధి చేస్తున్నట్టు కాలిఫోర్నియాలోని స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ సైంటిస్టులు చెబుతున్నారు. ఈ కొలి బ్యాక్టీరియాను విచ్ఛిన్నం చేసేసి, బయటకు వదిలేస్తోందని గుర్తించారు.
