విమానంలో పాము పిల్లలు.. ఆ తర్వాతేమైందంటే..

విమానంలో పాము పిల్లలు.. ఆ తర్వాతేమైందంటే..

చౌక ధరల విమానయాన సంస్థ థాయ్ ఎయిర్ ఏషియా విమానంలో ఇటీవల పాము కనిపించింది. బ్యాంకాక్‌ నుంచి ఫుకెట్‌కు బయలుదేరిన ఈ విమానంలో పాము ఉన్నట్లు కనిపిస్తోన్న వీడియోను ఓ టిక్‌టాక్ యూజర్ రికార్డ్ చేశాడు. ఈ వీడియో ఇప్పుడు టిక్‌టాక్‌తో పాటు ఎక్స్ లోనూ వైరల్ అవుతోంది. జనవరి 13న థాయ్‌ ఎయిర్‌ఏషియాకు చెందిన ఎఫ్‌డి3015 విమానంలో ఈ ఘటన జరిగింది. విమానం ల్యాండ్‌ అయ్యేలోపు ఈ పామును సిబ్బంది పట్టుకున్నారు. ఈ ఘటనలో ప్రయాణికులెవరూ గాయపడలేదు.

థాయ్ ఎయిర్‌ఏషియాకు చెందిన విమానం డాన్ మువాంగ్ విమానాశ్రయం నుంచి బయలుదేరి ఫుకెట్ విమానాశ్రయంలో దిగాల్సి ఉంది. విమానం గాలిలో ఉన్నప్పుడు, ఒక ప్రయాణీకుడు ఒక ఓవర్ హెడ్ బిన్ మీద నుండి ఒక సన్నని పామును గుర్తించాడు. దీంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. అనంతరం సిబ్బంది ఎట్టకేలకు పామును పట్టుకున్నారు.

ఈ వైరల్ వీడియోలో, ఒక వ్యక్తి పామును ప్లాస్టిక్ బాటిల్‌లోకి నెట్టడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపించింది. కానీ పాము తన దిశను మార్చుకోగా..  అతను ప్లాస్టిక్ బాటిల్‌ను ఉపయోగించి పామును ఖాళీ ప్లాస్టిక్ బ్యాగ్‌లోకి నెట్టాడు. విమానం ల్యాండ్ అయిన తర్వాత పామును అల్మారాలో భద్రంగా ఉంచారని స్థానిక మీడియా నివేదించింది. ప్రయాణీకులు విమానం నుండి బయలుదేరే ముందు, వారి క్యారీ-ఆన్ లగేజీని ఫుకెట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుండి భద్రతా అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేసి అక్కడ మరే పాము లేదని నిర్ధారించుకున్నారు. అయితే చిన్నపాటి పాము విమానంలోకి ఎలా ప్రవేశించిందనే విషయం మాత్రం తెలియరాలేదు.