అమిత్ షా పర్యటన.. స్నైపర్లు, షార్ప్‌షూటర్ల మోహరింపు 

అమిత్ షా పర్యటన.. స్నైపర్లు, షార్ప్‌షూటర్ల మోహరింపు 

న్యూఢిల్లీ: కేంద్ర హోం మంత్రి అమిత్ షా జమ్మూ కశ్మీర్‌ పర్యటనలో ఉన్నారు. మూడ్రోజుల విజిట్‌లో భాగంగా శనివారం శ్రీనగర్‌కు చేరుకున్నారు. టెర్రరిస్టులు గత కొన్ని వారాల నుంచి సాధారణ పౌరులను టార్గెట్‌గా చేసుకుని చంపుతున్న నేపథ్యంలో అమిత్ షా పర్యటన ఆసక్తిని సంతరించుకుంది. కశ్మీర్‌లో మైనార్టీలుగా ఉన్న హిందువులు, సిక్కులు, వలస కార్మికులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు చేసిన దాడుల్లో ఇప్పటివరకు 11 మంది వరకు చనిపోయారు. వివాదాస్పద ఆర్టికల్ 370 రద్దు తర్వాత షా కశ్మీర్‌కు వెళ్లడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 

భద్రత మరింత బలోపేతం

శ్రీనగర్‌లో అమిత్ షా మూడ్రోజుల పాటు బస చేయనున్నారు. దీంతో గుప్కర్ రోడ్డులోని రాజ్ భవన్‌కు 20 కి.మీ.ల పరిధిలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. శుక్రవారం శ్రీనగర్ ను సీఆర్‌పీఎఫ్‌కు చెందిన మోటార్‌బోట్లతోపాటు డ్రోన్లతో స్కానింగ్ చేశారు. వ్యూహాత్మక ప్రాంతాల్లో ముందస్తుగా స్నైపర్లు, షార్ప్‌షూటర్లను మోహరించారు. వాహనదారులతోపాటు పాదచారులను కూడా చెక్ చేస్తున్నారు. ప్రజలను వేధించాలనే ఉద్దేశంతో ఇలా చేయడం లేదని.. వాళ్ల రక్షణ కోసం చెకింగ్ చేస్తున్నామని సీఆర్‌పీఎఫ్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ మ్యాథ్యూ ఏ జాన్ తెలిపారు. కాగా, షా విజిట్ నేపథ్యంలో జమ్మూ కశ్మీర్‌లో దాదాపు 700 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సమాచారం. వీరిలో కొందర్ని పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ (పీఎస్‌ఏ) కింద అరెస్ట్ చేశారని తెలుస్తోంది. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో చాలా మంది టెర్రరిస్టు గ్రూపులకు గ్రౌండ్ లెవల్‌లో సాయం చేస్తున్నారని సమాచారం. 

సెక్యూరిటీపై టాప్ ఆఫీసర్లతో చర్చలు

కశ్మీర్‌ విజిట్‌ సందర్భంగా తొలి రోజు శ్రీనగర్ నుంచి షార్జాకు డైరెక్ట్ ఫ్లయిట్‌ సర్వీస్‌ను షా ప్రారంభించనున్నారు. అలాగే టెర్రరిస్టుల దాడుల్లో చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించనున్నారు. ఆ తర్వాత క్షేత్ర స్థాయిలో కశ్మీర్ లోయలో పరిస్థితుల గురించి పోలీసు, ఆర్మీ అధికారులతో చర్చించనున్నారు. ముఖ్యంగా బార్డర్‌లో చొరబాట్లు ఎక్కువ కావడంపై డిస్కస్ చేయనున్నట్లు తెలుస్తోంది. షాతో మీటింగ్‌లో భద్రతా పరమైన విషయాల గురించి చీఫ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ బ్యూరో అర్వింద్ కుమార్, చీఫ్ ఆఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ పంకజ్ సింగ్‌తోపాటు చీఫ్ ఆఫ్ సీఆర్‌పీఎఫ్. చీఫ్ ఆఫ్ ఎన్‌ఎస్‌జీ, జమ్మూ కశ్మీర్ టాప్ పోలీసు అధికారులు తమ అభిప్రాయాలను చెప్పనున్నారు. 

మరిన్ని వార్తల కోసం: 

26 రోజుల్లో 19సార్లు పెరిగిన పెట్రోల్ ధరలు

ఏటీఎంలో డబ్బులు పెట్టెటోళ్లే చోరీ చేసిన్రు

అదనపు వాటా చెల్లించినోళ్లకే గొర్లు: తలసాని