హైదరాబాద్లో టమాటాల కొరత.. సగానికి సగం తగ్గిన సరుకు

హైదరాబాద్లో టమాటాల కొరత.. సగానికి సగం తగ్గిన సరుకు

టమాట ధరలు కొండెక్కాయి. టమాట పంట సాగు తెలంగాణలో భారీగా తగ్గిపోవడం, డిమాండ్​కు తగ్గ పంట లేకపోవడంతో రేట్లు అమాంతం పెరిగాయి. మూడు రోజుల కింద రూ.60 నుంచి రూ.70 పలికిన కిలో టమాట.. ఇప్పుడు వంద రూపాయలు దాటింది. రాబోయే వారం రోజుల్లో ధరలు మరింత పెరిగే చాన్స్​ ఉన్నట్టు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.

సాధారణంగా హైదరాబాద్​ బోయిన్​పల్లి మార్కెట్​కు 5 వేల క్వింటాళ్ల టమాటా మార్కెట్​కు వస్తే కానీ  హైదరాబాద్ జనం అవసరాలకు సరిపోదు. వచ్చిన టమాటలోనూ 96 శాతం బయట నుంచే వస్తుండగా.. 3.34 శాతం మాత్రమే  తెలంగాణ రాష్ట్రం నుంచి వస్తున్నది. ఇది ఏ మాత్రం సరిపోవడం లేదు. 2024, జూన్ 19వ తేదీ బోయిన్​పల్లి హోల్​సేల్​ మార్కెట్​కు 2 వేల 125 క్వింటాళ్ల టమాట మాత్రమే వచ్చింది. 

ఇందులో తెలంగాణలో పండిన పంట 71 క్వింటాళ్లు మాత్రమే. మిగతా పంట ఏపీ, కర్నాటక, మహారాష్ట్రల నుంచి దిగుమతి అయింది. ఇందులో వెయ్యి క్వింటాళ్లు ఏపీలోని మదనపల్లి నుంచి వచ్చింది. తెలంగాణలోని గజ్వేల్, మేడ్చల్, జహీరాబాద్, తూప్రాన్, వికారాబాద్, శామీర్​పేట్, సిద్దిపేట, భువనగిరి, గద్వాల ప్రాంతాల నుంచి రావాల్సినంత టమాట లోడ్లు రావడం లేదు. ఎండల ప్రభావంతో టమాట సాగు తగ్గడమే ఇందుకు కారణమని అధికారులు అంటున్నారు. టమాట కొరత ఏర్పడడంతో బహిరంగ మార్కెట్​లో​ఈ కూరగాయ ధరలు మండిపోతున్నాయి.

పంట ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోవడంతో అన్నిరకాల ధరలకు రెక్కలు వచ్చాయి. రూ.500 పట్టుకుని మార్కెట్‌‌‌‌కు వెళితే సంచి కూడా నిండడం లేదు. నిత్యం వంటల్లో వినియోగించే టమాటా, పచ్చిమిర్చి ధరలు హోల్‌‌‌‌సేల్‌‌‌‌లోనే కిలో రూ.100 వరకు పలుకుతుండగా.. రిటైల్‌‌‌‌గా కిలో రూ.120 వరకు విక్రయిస్తున్నారు. దుంపకూరలు కూడా కిలో రూ.60కి తగ్గడం లేదు.  అన్నిరకాల కూరగాయల ధరలు పెరగడంతో సామాన్యులు మార్కెట్‌‌‌‌వైపు వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.