- కుట్ర నిజమని తేలితే కనీసం 25ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం
ఫుట్‌బాల్ మాంత్రికుడు డిగో మారడోనా మరణం వెనుక కుట్ర ఉందన్న షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. ఆయన మరణం సాధారణం కాదని చికిత్స అందించడంలో డాక్టర్లు ఉద్దేశ పూర్వకంగా నిర్లక్ష్యం వహించడం వల్లే చనిపోయారన్నవిషయం సంచలనం రేపుతోంది. దీనికి సంబంధించి ఏడుగురు డాక్టర్లపై అర్జంటినా ప్రభుత్వ అధికారులు విచారణ ప్రారంభించారు.గత ఏడాది నవంబర్‌లో డిగో మారడోనా గుండెపోటుతో మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే అప్పట్లో ఆయనకు జరిగిన చికిత్సపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. వైద్యులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారని..ఉద్దేశ పూర్వకంగా చనిపోయేటట్లు వ్యవహరించారని ఆరోపణలు గుప్పు మనడంతో అర్జెంటినా ప్రభుత్వం స్పందించింది. విచారణకు ఆదేశిస్తూ మెడికల్ బోర్డును ఏర్పాటు చేసింది. ఈ వైద్య నిపుణుల బృందం జరిపిన విచారణ పూర్తయినట్లు సమాచారం. ఈ వైద్యుల బోర్డు విచారణ పూర్తి చేసి తయారు చేసే పనిలో ఉండగా.. సంచలన విషయాలు ప్రచారం అవుతున్నాయి. బోర్డులోని సభ్యులే లీక్ చేసినట్లు బలంగా వాదిస్తూ విదేశీ మీడియా వార్తలు వండి వారుస్తోంది. కొంత కాలం మాదక ద్రవ్యాలకు బానిసగా మారి వాటి నుండి బయటపడేందుకు థెరపీ చికిత్స తీసుకున్నారు డిగో మారడోనా. ఆరోగ్యం కుదుట పడినా మళ్లీ తీవ్ర సమస్యలు కావడంతో డాక్టర్ల ఆధ్వర్యంలో చికిత్స చేయించుకున్నారు. అయితే ఆయనకు చికిత్స చేసిన డాక్టర్లు చాలా నిర్లక్ష్యం వహించారని, అందుకే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి మీడియా రాస్తోంది. దీనికి సంబంధించి ఏడుగురు వ్యక్తులను విచారిస్తున్నారు. పథకం ప్రకారమే మారడోనాను చంపినట్లు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
