దేవాదాయ శాఖలో సోషల్ ఆడిటింగ్ ..బీఆర్ఎస్ హయాంలో డీడీఎన్( ధూప, దీప స్కీం) నిధులు కాజేశారని ఆరోపణలు

దేవాదాయ శాఖలో సోషల్ ఆడిటింగ్ ..బీఆర్ఎస్ హయాంలో డీడీఎన్( ధూప, దీప  స్కీం) నిధులు కాజేశారని ఆరోపణలు
  • పలు ఆలయాల్లో అవకతవకలపై సర్కార్ కు  ఫిర్యాదులు 
  • నిధుల కేటాయింపు, హుండీ ఆదాయం, ఖర్చులపై తనిఖీలు
  • టికెట్ల విక్రయాలు, ధూపదీప స్కీం దరఖాస్తులపై ఫోకస్
  • రూరల్ డెవలప్మెంట్ సోషల్ ఆడిటింగ్ విభాగానికి తనిఖీ బాధ్యతలు
  • ఇప్పటికే చేయూత పింఛన్లపై ప్రారంభమైన సోషల్ ఆడిట్

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ శాఖల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించడానికి సోషల్ ఆడిట్ ను నిర్వహిస్తారు. నిధుల కేటాయింపు, వినియోగం, పథకాల అమలు తీరు ఎలా ఉందో తెలుసుకొని అక్రమాలు జరిగితే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారు. రాష్ట్రంలో ఆలయాలకు సమకూరుతున్న ఆదాయం, ఖర్చులు, నిధుల కేటాయింపు, నిర్వహణతోపాటు స్పెషల్ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్ ఫండ్స్ (ఎస్​డీఎఫ్) కింద కేటాయించిన నిధులు, రికార్డుల నిర్వహణ, ధూపదీప నైవేద్యం పథకం అమలు తీరుపై సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇందుకోసం సోషల్ ఆడిట్ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు రూరల్ డెవలప్​మెంట్ లోని సోషల్ ఆడిటింగ్​విభాగానికి తనిఖీ బాధ్యతలు అప్పగించింది.

ధూప దీప నైవేద్య పథకంలో అక్రమాలపై ఫిర్యాదులు

రాష్ట్రంలో ప్రస్తుతం 6,541 ఆలయాల్లో ధూప దీప నైవేద్య(డీడీఎన్) పథకం అమలు అవుతున్నది. ఇందుకోసం ప్రతినెలా ప్రభుత్వం రూ.6.54 కోట్ల నిధులు కేటాయిస్తున్నది. ఇప్పుడు మరో 250 ఆలయాలను ఈ పథకంలో ఎంపిక చేస్తే ప్రభుత్వానికి రూ.25 లక్షల వరకు అదనపు భారం పడనున్నది. ఆదాయం లేని ఆలయాల నిర్వహణ, సంప్రదాయ పూజల కోసం డీడీఎన్ పథకంలో నిధులు కేటాయిస్తోంది. 

డీడీఎన్ పథకం కింద ఎంపికైన ఆలయాలకు నెలకు ప్రభుత్వం రూ.10,000 ఆర్థిక సాయం అందిస్తున్నది. ఇందులో అర్చకులకు గౌరవభృతిగా రూ.7,000, ధూప, దీప, నైవేద్యం వంటి పూజా సామగ్రి కోసం రూ.3,000 కేటాయిస్తోంది. అయితే, రాష్ట్రంలో ధూపదీప నైవేద్యం పథకంలో అక్రమాలు చోటుచేసుకున్నాయని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. గత సర్కార్ హయాంలో  ఆలయాలు లేకపోయినప్పటికీ ఉన్నట్లు డీడీఎన్​పథకంలో చేర్చి నిధులు కాజేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ స్కీమ్ అమలు తీరుపై ప్రభుత్వం దృష్టి సారించింది. 

డీడీఎన్ స్కీమ్ కోసం వచ్చిన అప్లికేషన్లు, ఎన్ని ఆలయాలకు స్కీమ్​ వర్తింపజేశారు. అసలు అక్కడ ఆలయం ఉందా.. లేదా..? ఉంటే ఎవరు నిర్వహణ చేపడుతున్నారు. నిత్య పూజలు చేస్తున్నారా..? పూజారులు ఎవరు..? ఏమైనా అవకతవకలు జరుగుతున్నాయా..? అనేది సామాజిక తనిఖీ ద్వారా తెలుసుకోనున్నది.

ఆలయాల్లో టికెట్ల దందాపై తనిఖీలు

 రాష్ట్రంలో ఈవోల పరిధిలో 704 ఆలయాలు ఉన్నాయి. వీటి నుంచి వచ్చే ఆదాయం (హుండీలు, దానాలు, ఆస్తుల రూపంలో), ఖర్చులు (అభివృద్ధి పనులు, నిర్వహణ), స్పెషల్ డెవలప్‌‌‌‌మెంట్ ఫండ్స్ (ఎస్​డీఎఫ్) కింద ఆలయాల అభివృద్ధి పనులు, భక్తులకు సౌకర్యాల కల్పన (వసతి గృహాలు, పార్కింగ్, పరిశుభ్రత) ఎలా ఉంది? నిధులు వినియోగం తదితర అంశాలపై తనిఖీ చేయనున్నారు. 

ఆలయాల్లో రికార్డుల నిర్వహణ సక్రమంగా జరుగుతుందా..? అని వివరాలపై ఆరా తీయనున్నారు. గతంలో బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో నకిలీ టికెట్ల బాగోతం వెలుగుచూసింది. దీంతో ఆలయాల్లో టికెట్ల విక్రయాలపై తనిఖీలు చేపట్టనున్నారు. ఆలయ నిర్వహణలో లోపాలు, అవినీతి ఆరోపణలపై ఫిర్యాదులను స్వీకరించి, వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఆలయ ఆస్తులు, నిధుల వినియోగంపై ప్రధానంగా ఫోకస్ పెట్టనున్నారు

చేయూత పింఛన్ల అవకతవకలపై సోషల్ ఆడిట్​

చేయూత (గతంలో ఆసరా) పెన్షన్లపై ప్రభుత్వం సోషల్ ఆడిట్ చేపట్టింది. పెన్షన్ల మంజూరు, పంపిణీలో అవకతవకలకు చెక్​పెట్టేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. అనర్హులను తొలగించి అర్హులైనవారికే అందించాలని సోషల్ ఆడిట్​ చేపడుతున్నది. 

రాష్ట్రంలో మొత్తంగా 44.20 లక్షల మందికిపైగా వివిధ రకాల పింఛన్ అందుకుంటున్నారు. కొంతమంది చనిపోయిన వారిపేరుపై పింఛన్లు కాజేస్తున్నారని, అనర్హులు పింఛన్ తీసుకుంటున్నారని, ప్రభుత్వశాఖలు, ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగుల కుటుంబ సభ్యలు పింఛన్లు పొందుతున్నారని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. దీంతో  పెన్షన్ల విధానంలో అవకతవకలను అరికట్టి పారదర్శకతను పెంపొందించేందుకు సోషల్​ ఆడిట్ కు శ్రీకారం చుట్టింది.