సోషల్ మీడియా ప్రచారానికి కోట్లల్లో ఖర్చు

సోషల్ మీడియా ప్రచారానికి కోట్లల్లో ఖర్చు
  • సోషల్ మీడియా ప్రచారానికి కోట్లల్లో ఖర్చు
  • అనుభవమున్న సంస్థలకు బాధ్యతలు అప్పగిస్తున్న క్యాండిడేట్లు 
  • సగటున రూ.50 లక్షల నుంచి రూ.70 లక్షల వరకు ప్యాకేజీ
  • మీమ్స్‌‌‌‌‌‌‌‌, వీడియోలతో ఓటర్లకు దగ్గరయ్యే ప్రయత్నం
  • ప్రత్యర్థులపై ఆరోపణలు, విమర్శలకూ ఇదే వేదిక

హైదరాబాద్, వెలుగు : గతంలో ఎన్నికల ప్రచారమంటే సభలు, సమావేశాలు, పాదయాత్రలు, ఇంటింటికీ తిరిగే కార్యక్రమాలకు ఎక్కువ ప్రాధాన్యం ఉండేది. కానీ, ఇప్పుడు ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. ఎన్నికల ప్రచారం ఊర్లలో, రోడ్ల మీద కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువగా జరుగుతోంది. ఓటర్లను చేరడానికి సామాజిక మాధ్యమాలే ప్రధాన మార్గాలుగా మారాయి. సొంత డబ్బా కొట్టుకోవడానికి, ప్రత్యర్థిపై విమర్శలు కురిపించడానికి, ప్రత్యర్థి చేసే ఆరోపణలను తిప్పికొట్టడానికి అభ్యర్థులు సోషల్ మీడియాను ఆశ్రయించక తప్పడం లేదు. అయితే, బిజీ షెడ్యూల్‌‌‌‌‌‌‌‌లో పదుల సంఖ్యలో ఉన్న సోషల్ యాప్స్‌‌‌‌‌‌‌‌ను వినియోగించుకోవడం నాయకులకు సాధ్యమయ్యే పనికాదు. దీంతో తమ తరఫున పని చేయడానికి సోషల్ మీడియా క్యాంపెయినర్లను నియమించుకుంటున్నారు. 

అల్లాటప్పాగా కాకుండా అనుభవమున్న సంస్థలకు ఈ పని అప్పగిస్తున్నారు. ఎక్స్‌‌‌‌‌‌‌‌పర్ట్ టీమ్స్‌‌‌‌‌‌‌‌తో ప్రచారం చేయించుకుంటున్నారు. ఇందుకోసం సగటున రూ.50 లక్షల నుంచి రూ.70 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. కాగా, ప్రస్తుతం అనేక మంది దీన్ని ఒక ఉపాధి మార్గంగా ఎంచుకుని పని చేస్తున్నారు. ఒక్కో క్యాండిడేట్‌‌‌‌‌‌‌‌ వద్ద భారీ మొత్తంలో చార్జ్ చేస్తున్నారు. ప్రచారంతో పాటు సర్వే బాధ్యతలు కూడా తీసుకుంటే అదనంగా చార్జీ చేస్తున్నారు. 

ఫుల్లు కంటెంట్‌‌‌‌‌‌‌‌

తమకు కాంట్రాక్ట్ ఇచ్చిన నాయకుని ప్రసంగాలను, అభివృద్ధి కార్యక్రమాలను జనాలకు చేరువ చేసేందుకు వినూత్నంగా మీమ్స్‌‌‌‌‌‌‌‌, వీడియోలను ఈ సంస్థలు తయారు చేస్తున్నాయి. వీటిని వాట్సప్‌‌‌‌‌‌‌‌, ఇన్‌‌‌‌‌‌‌‌స్టాగ్రామ్‌‌‌‌‌‌‌‌, టెలీగ్రామ్, ఫేస్‌‌‌‌‌‌‌‌బుక్‌‌‌‌‌‌‌‌, ట్విటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వంటి సోషల్ మీడియా యాప్స్‌‌‌‌‌‌‌‌లో పార్టీ కార్యకర్తలకు ఫార్వర్డ్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నాయి. నాయకుని పేరుతో ఉన్న  సోషల్ మీడియా అకౌంట్లలో అప్‌‌‌‌‌‌‌‌లోడ్ చేస్తున్నాయి. ఈ టీమ్‌‌‌‌‌‌‌‌లు ఇచ్చిన కంటెంట్‌‌‌‌‌‌‌‌ను కార్యకర్తలు తమ సోషల్ మీడియా అకౌంట్లలో, గ్రూపుల్లో పెడుతున్నారు. 

ఇలా సోషల్ మీడియా ద్వారా ప్రతి ఓటరుకూ చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడితోనే ఈ పని ఆగదు. తమ అభ్యర్థిపై ప్రత్యర్థి చేసే ఆరోపణలను, విమర్శలను తిప్పికొట్టే బాధ్యత కూడా ఈ సంస్థలపైనే ఉంటుంది. ఇందుకోసం ప్రత్యర్థిని ట్రోల్ చేస్తూ మీమ్స్‌‌‌‌‌‌‌‌, వీడియోలు క్రియేట్ చేసి షేర్ చేస్తున్నారు. గతంలో ఇచ్చిన హామీలు, ఇప్పుడు వాటి పరిస్థితి, గతంలో మాట్లాడిన మాటలు, ఇప్పుడు వాటిని విభేదిస్తూ మాట్లాడిన వీడియోలను, ఆడియోలను కార్యకర్తలు వెంట వెంటనే జనాల్లోకి తీసుకెళ్తున్నారు.

ఫేక్ అకౌంట్లు.. అబద్ధాల ప్రచారం.. 

ఎన్నికల్లో ఎట్లయినా గెలవాలన్న లక్ష్యంతో తమ ప్రత్యర్థులపై నేతలు నిరాధార ఆరోపణ లు చేస్తుంటారు. సోషల్ మీడియా వచ్చాక మరింత దిగజారి ప్రవర్తిస్తున్నారు. ప్రత్యర్థి మాటలను వక్రీకరించడం, ఫొటోలు, వీడి యోలను మార్ఫింగ్ చేయడం, ఫేక్​ పత్రాలు సృష్టించడం వంటి నేరాలకు పాల్పడుతు న్నారు. వీటిని జనాల్లోకి తీసుకెళ్లడానికి ఫేక్ సోషల్ మీడియా అకౌంట్లను వినియోగిస్తు న్నారు. ఈ ఫేక్ అకౌంట్లను కార్యకర్తలకు ముందే తెలియజేస్తున్నారు. వాళ్లు ఈ అకౌం ట్లను ఫాలో అవుతూ, ఇందులో అప్‌‌‌‌‌‌‌‌లోడ్ అయ్యే కంటెంట్‌‌‌‌‌‌‌‌ను షేర్ చేస్తున్నారు. ఇతరు లకు ఫార్వర్డ్ చేస్తున్నారు. ఈ అబద్ధపు, అసత్య కంటెంట్‌‌‌‌‌‌‌‌ను క్రియేట్ చేసేందుకు సంస్థలు ప్రత్యేకంగా చార్జ్ చేస్తున్నాయి.