ది ఫ్యామిలీ స్టార్(The Family Star) సినిమాపై సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్ ఆశ బొర్రా(Asha Borra) సంచలన కామెంట్స్ చేశారు. తనను ఈ సినిమా కోసం వాడుకొని వదిలేశారని, అందుకే సినిమా అట్టర్ ప్లాప్ అయ్యిందని సంచలన కామెంట్స్ చేశారు. సోషల్ మీడియాలో ఆమె చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. రౌడీ హీరో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ది ఫ్యామిలీ స్టార్. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సంస్థ నుండి వచ్చిన ఈ సినిమా ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ నుండి మిక్సుడ్ టాక్ వచ్చింది. కానీ, ఫ్యామిలీ ఆడియన్స్ నుండి మాత్రం మంచి రెస్పాన్స్ ను రాబట్టింది ఈ మూవీ. దీంతో కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో రాబడుతోంది.
ఇదిలా ఉంటే.. ది ఫ్యామిలీ స్టార్ సినిమాలో చిన్న పాత్రలో మెరిశారు ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్ ఆశ బొర్రా. సినిమా మొదలైన కొన్ని నిమిషాలకే విజయ్ తో కలిసి ఒకే ఒక్క సీన్ లో కనిపిస్తారు ఆమె. తాజాగా అదే విషయంపై స్పందిస్తూ సంచలన కామెంట్స్ చేశారు ఆశ.. నాలాంటి వాళ్ళని పిలిచి అవుట్ స్టఫ్ గా వాడుకొని వదిలేస్తే సినిమా అట్టర్ ఫ్లాప్ అవకుండా ఇంకేమవుతుంది? ఇంతోటి దానికి నా టైం వేస్ట్ చేసి మీ టైం కూడా వేస్ట్ చేసుకున్నారు.
పైగా ఫోన్లు, హంగామా? అయినా.. హైదరాబాదులో జూనియర్ ఆర్టిస్టులకు లేరా? ఏమైనా కరువు వచ్చిందా? లేక సోషల్ మీడియా ఫేమ్ వాడుకోవాలని అనుకున్నారా? పనులు, ఫ్యామిలీని వదులుకొని వచ్చి షూట్ చేశాను. ఇస్తామన్న రెమ్యునరేషన్ ఇవ్వలేదు, ట్రావెల్ అలవెన్స్ కూడా ఇవ్వలేదు. చాలా గ్రేట్. కనీసం సినిమాలో విజయ్ తో నేను చేసిన చిన్న సీన్ ఉంచినా ఆనందంగా ఉండేదేమో.. అంటూ సుదీర్ఘమైన పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆమె చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.