- యాదాద్రి జిల్లా కొయ్యలగూడెం శివారులో ఫామ్‌హౌస్‌లో వీకెండ్ పార్టీ
- అర్ధరాత్రి టైంలో స్విమ్మింగ్ పూల్‌లో కనిపించిన డెడ్‌బాడీ
- తోటి ఉద్యోగులే హత్య చేశారని తండ్రి ఫిర్యాదు
చౌటుప్పల్, వెలుగు : సాఫ్ట్ వేర్ ఉద్యోగులు చేసుకున్న వీకెండ్ పార్టీ విషాదంగా ముగిసింది. అనుమానాస్పదంగా ఓ ఉద్యోగి చనిపోయిన ఘటన యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం శివారులోని ఓ ఫామ్‌హౌస్‌లో శనివారం అర్ధరాత్రి జరిగింది. చౌటుప్పల్ సీఐ మన్మథకుమార్ తెలిపిన వివరాల ప్రకారం... మంచిర్యాల జిల్లాకు చెందిన గాండ్ల రాము (27) హైదరాబాద్ రామంతాపూర్‌లోని ఆసెంట్ బిజినెస్ సొల్యూషన్ అనే కంపెనీలో పనిచేస్తున్నాడు. శనివారం వీకెండ్ కావడంతో 19 మంది ఉద్యోగులు కొయ్యలగూడెం పరిధిలోని ఆర్వా రిట్రీట్ ఫామ్‌హౌస్‌లో పార్టీ చేసుకునేందుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో ఫుడ్ విషయంలో రాముకు సాయికృష్ణ అనే మరో ఉద్యోగి మధ్య గొడవ జరుగగా.. మిగతా వారు నచ్చజెప్పారు.
అర్ధరాత్రి 12 గంటల సమయంలో అందరూ స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొడుతుండగా కాళ్లకు ఏదో తగిలినట్లు అనిపించడంతో బయటకు తీసి చూడగా రాము కనిపించాడు. వెంటనే సీపీఆర్ చేసి 108లో చౌటుప్పల్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. కానీ అప్పటికే చనిపోయినట్లు చెప్పడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి వివరాలు సేకరించిన అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కాగా, తన కొడుకు మృతిపై అనుమానాలు ఉన్నాయని, మద్యం మత్తులో తోటి ఉద్యోగులే కొట్టి చంపారని మృతుడి తండ్రి గాండ్ల అంజయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు పార్టీకి హాజరైన వారందరినీ అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. పోస్టుమార్టం, ఫోరెన్సిక్ రిపోర్ట్ ఆధారంగా రాము మృతికి కారణాలు తెలిసే అవకాశం ఉందని పోలీసులు చెప్పారు. మరో వైపు మద్యం మత్తు, విషప్రయోగం కోణాల్లోనూ దర్యాప్తు చేపట్టారు.
