అమెరికాలో పనిచేస్తున్న భారతీయ ఐటీ నిపుణుడికి హెచ్-1బీ వీసా అనేది కేవలం ఒక అధికారిక పత్రం కాదు. అది అతని ఉద్యోగ భద్రతకు, కుటుంబ భవిష్యత్తుకు పునాది. ఒకసారి వీసా ముద్రణ కోసం స్వదేశానికి వచ్చిన తర్వాత తిరిగి అమెరికాకువెళ్లే మార్గం నిలిచిపోతే అది ఒక జీవన విఘాతం. ప్రస్తుతం వేలాది మంది భారతీయ టెక్కీలు అదే స్థితిలో ఉన్నారు. తాత్కాలికంగా వచ్చిన ఇండియా ట్రిప్ అనిశ్చితమైన నిరీక్షణగా మారింది. 2025 చివరి తర్వాత హెచ్-1బీ ఇంటర్వ్యూ స్లాట్ల విడుదల గణనీయంగా తగ్గడం, 2026లో అనేక కాన్సులేట్ కేంద్రాల్లో ‘అపాయింట్‌మెంట్ లేదు’ పరిస్థితి కనిపించడం, కొందరికి 2027 వరకు తేదీలు చూపించడం ఇవన్నీ ఈ సంక్షోభం తీవ్రతను బలంగా తెలియజేస్తున్నాయి.
భారతీయ హెచ్-1బీ టెక్కీలు ఈ సంక్షోభం వల్ల ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా భారీ సంఖ్యలో ప్రభావితమవుతున్నారు. ప్రతి సంవత్సరం సుమారు 2.5 లక్షల నుంచి 3 లక్షల వరకు హెచ్-1బీ వీసా హోల్డర్లు భారతదేశం నుంచి ప్రయాణాలు చేస్తారు. ప్రస్తుతం దాదాపుగా 40 వేల మంది టెక్కీలు నేరుగా ఇరుక్కుపోయారు. మరో 2–3 లక్షల మంది అనిశ్చితిలో ఉన్నారు.
గ్లోబల్ టాలెంట్ మొబిలిటీ సంక్షోభం
హెచ్-1బీ వ్యవస్థలో వీసా ముద్రణ లేకుండా అమెరికాలోకి తిరిగి ప్రవేశం లేదు. అంటే ఉద్యోగి తన పనికి హాజరుకాలేడు. ఉద్యోగి ఒక వ్యక్తి మాత్రమే కాదు. అతను ఒక ప్రాజెక్ట్‌లో కీలక భాగం, ఒక సంస్థకు అవసరమైన నైపుణ్యం. కొంతకాలం సంస్థలు సహనం చూపించినా.. నెలలు గడిచేకొద్దీ వ్యాపార అవసరాలు ముందుకు వస్తాయి. పనులు మరొకరికి అప్పగించక తప్పదు. చివరికి ఉద్యోగం ప్రమాదంలో పడుతుంది. అందువల్ల ఇది ఒక ఇమ్మిగ్రేషన్ సమస్య కాదు. ఇది గ్లోబల్ టాలెంట్ మొబిలిటీ వైఫల్యం. ఈ పరిస్థితి ఒక కీలక ప్రశ్నను లేవనెత్తుతోంది. ప్రపంచీకరణలో నైపుణ్య వలసదారులను ఆర్థికంగా ఉపయోగించుకునే వ్యవస్థలు వారి సమస్యలను సమర్థంగా పరిష్కరించగలుగుతున్నాయా?
మూడు కీలక రంగాల సంక్షోభం
ఇది ప్లానింగ్, పారదర్శకత, కమ్యూనికేషన్ వైఫల్యాల సమ్మేళనం. ఈ సంక్షోభం ప్రభావం ఒకే స్థాయిలో ఉండదు. కుటుంబ సంబంధాలు భౌతిక దూరం వల్ల ఎమోషనల్‌గా కూడా దూరం అవుతున్నాయి. ఇది ఒక దీర్ఘకాల ఒత్తిడి పరిస్థితి. నిరాశ, ఆందోళన, నిస్పృహ ఇవి ఒక క్రమంలో వస్తాయి. ప్రతిరోజూ స్లాట్ చెక్ చేయడం ఒక బలవంతపు అలవాటుగా మారుతుంది. అమెరికాలో ఇంటి రుణాలు, అద్దె, బీమా, ఇతర ఖర్చులు కొనసాగుతూనే ఉంటాయి. కానీ, ఆదాయం నిలిచిపోతే ఖర్చులు, -ఆదాయం మధ్య అసమతౌల్యం ఏర్పడుతుంది. ఇది తాత్కాలిక సమస్య కాదు.. దీర్ఘకాల ప్రభావం చూపగల పరిస్థితి.
సంక్షోభానికి పరిష్కార మార్గాలు
ఈ సంక్షోభానికి పరిష్కారం ఒకే చర్యతో సాధ్యం కాదు. మొదటగా తక్షణ ఉపశమన చర్యలు అవసరం. పెద్ద మొత్తంలో వీసా స్లాట్లను ఒకేసారి విడుదల చేయడం, నిర్దిష్ట షెడ్యూల్ ప్రకారం విడుదల చేయడం ద్వారా అనిశ్చితిని తగ్గించవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి, ఉద్యోగం కోల్పోయే ప్రమాదంలో ఉన్నవారు, చిన్న పిల్లలతో విడిపోయిన కుటుంబాలు, వైద్య అవసరాలు ఉన్నవారికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలి. అదనంగా వీకెండ్ ప్రాసెసింగ్, తాత్కాలిక సిబ్బంది నియామకం ద్వారా ప్రాసెసింగ్ వేగాన్ని పెంచవచ్చు. పూర్తి వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచే డ్యాష్‌బోర్డ్ వ్యవస్థ అవసరం. డ్రాప్‌బాక్స్ అర్హతను విస్తరించడం ద్వారా ఇంటర్వ్యూ అవసరం లేని కేసులను వేగంగా క్లియర్ చేయవచ్చు. కాన్సులేట్ సిబ్బంది పెంపు, ప్రాసెసింగ్ సామర్థ్య
విస్తరణ, కేంద్రాల వికేంద్రీకరణ వంటి నిర్మాణాత్మక మార్పులు అవసరం. భారతదేశం, అమెరికా మధ్య నైపుణ్య ఉద్యోగుల చలనాన్ని సులభతరం చేసే ప్రత్యేక విధాన ఒప్పందం అమలుచేయాలి. ఈ సమస్యను కేవలం వ్యక్తిగత ఇమ్మిగ్రేషన్ సమస్యగా కాకుండా ద్వైపాక్షిక ఆర్థిక అంశంగా చూడాలి. భారత ప్రభుత్వ పాత్ర కూడా కీలకం. ఈ సమస్యను అధికారికంగా ప్రస్తావించడం, డేటా ఆధారంగా చర్చలు జరపడం, ప్రభావిత ఉద్యోగులకు సహాయక వ్యవస్థలు ఏర్పాటు చేయడం వంటి చర్యలు తీసుకోవాలి. ఈ సంక్షోభం మనకు ఒక స్పష్టమైన సందేశం ఇస్తోంది. ప్రపంచీకరణలో మనిషి కేవలం ఒక వనరుగా కాకుండా ఒక
కుటుంబానికి కేంద్రబిందువుగా ఉన్నాడు. సాంకేతి కత దేశాలు దాటుతుంది. డబ్బు క్షణాల్లో మారుతుంది. కానీ, ఒక మనిషి తన కుటుంబం దగ్గరకు చేరడానికి నెలల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది.
వైఫల్యం నుంచి హెచ్చరిక వరకు
ఈ సంక్షోభంలో పాలసీ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. అధిక డిమాండ్ ఉన్నప్పటికీ తగిన సిబ్బందిని పెంచకపోవడం, స్లాట్ విడుదలలో పారదర్శకత లేకపోవడం, స్పష్టమైన సమాచార వ్యవస్థ లేకపోవడం.. ఇవన్నీ సమస్యను మరింత సంక్లిష్టం చేశాయి. ఇది కేవలం అమెరికా పరిపాలనా సమస్య కాదు, ద్వైపాక్షిక మానవ వనరుల అంశం. భారత ప్రభుత్వం కూడా దీనిని వ్యూహాత్మకంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భారతీయ నైపుణ్య ఉద్యోగులు అమెరికా ఆర్థిక వ్యవస్థలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇదే సమయంలో ఈ పరిస్థితి ఇండియన్ ఐటీ రంగానికి ఒక స్పష్టమైన హెచ్చరిక. విదేశీ పనులపై ఆధార
పడే మోడల్లో ఇలాంటి సమస్యలు పెరిగితే అవకాశాలు తగ్గవచ్చు. ఇతర దేశాలకు మార్పు వేగవంతం కావచ్చు. భవిష్యత్తులో ఉద్యోగం కంటే మొబిలిటీ స్థిరత్వం కూడా ఒక ముఖ్య ప్రమాణంగా మారుతుంది.
- బి.హర్షవర్ధన్
