చెన్నూర్​లో మట్టి మాఫియా .. చెరువులు, కుంటల్లో యథేచ్ఛగా తవ్వకాలు

చెన్నూర్​లో మట్టి మాఫియా .. చెరువులు, కుంటల్లో యథేచ్ఛగా తవ్వకాలు
  • ఎనగుట్టను మాయం చేస్తున్న అక్రమార్కులు  
  • ఇటుక బట్టీలు, రియల్​ వెంచర్లకు తరలింపు 
  • చూసీచూడనట్టు వ్యవహరిస్తున్న అధికారులు 

చెన్నూర్, వెలుగు: చెన్నూర్​లో మట్టి మాఫియా అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. వారి ఆగడాలు ‘మూడు టిప్పర్లు.. ఆరు ట్రాక్టర్లు’ అన్న చందంగా సాగుతున్నాయి. మట్టి దందాకు గుట్టలకు గుట్టలే మాయమవుతున్నాయి. చెన్నూర్​లో ఇండ్ల నిర్మాణాలకు, రియల్​ఎస్టేట్​ వెంచర్లకు, ఇటుక బట్టీలకు విచ్చలవిడిగా మట్టిని తరలిస్తున్నారు. చెరువులు, కుంటలతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు భూముల్లో యథేచ్ఛగా మట్టి తవ్వకాలు జరుగుతున్నా ఆఫీసర్లు చూసీచూడనట్టు ఊరుకుంటున్నారు.

జేసీబీలు, పేలుళ్లతో తవ్వకాలు

చెన్నూర్​ నుంచి బుద్దారం వెళ్లే దారిలోని సర్వే నంబర్​1418లోని ఎనగుట్టను జేసీబీలతో తవ్వుతున్నారు. పేలుడు పదార్థాలు ఉపయోగించి బండరాళ్లను పేల్చుతున్నారు. ట్రాక్టర్ మట్టికి రూ.వెయ్యి నుంచి రూ.1500, బేస్​మెంట్ బండ రూ.3వేలు, పునాది రాళ్ల బండను రూ.1800కు అమ్ముకుంటూ లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు. మట్టి దొంగలు ఎటువంటి అనుమతులు తీసుకోకుండానే రోజుకు సుమారు 200 ట్రిప్పులు తరలిస్తున్నారు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ, మైనింగ్​ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుండడం అనుమానాలకు తావిస్తోంది. 

ఇటుక బట్టీలకు చెరువు మట్టి

మండలంలోని లంబడిపల్లి, ఎల్లక్కపేట, బావురావుపేట, చిట్టూరికుంట, శనిగకుంట, మల్లెవేనికుంట తదితర చెరువుల నుంచి ఒండ్రు మట్టిని ఎల్లక్కపేట, లంబడిపల్లి, చెన్నూర్​లోని ఇటుక బట్టీలకు తరలిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇటుక బట్టీలు నడుపుతున్న వ్యాపారులు పెద్ద ఎత్తున అక్రమంగా మట్టిని తరలిస్తూ లక్షలు గడిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మట్టి, మొరం, బండ తవ్వకాలు చేసే వారిపై కేసులు నమోదు చేయాలని స్థానికులు డిమాండ్​చేస్తున్నారు.