- రంగంలోకి దింపనున్న రాష్ట్ర సర్కార్
- మూడు నెలల్లో 4 లక్షల మట్టి శాంపిళ్లను పరీక్షించడమే టార్గెట్
- వ్యవసాయ శాఖ, ఇక్రిశాట్, జయశంకర్వర్సిటీ, పలు ప్రైవేటు కంపెనీల భాగస్వామ్యంతో టెస్ట్‌లు
- రసాయనిక ఎరువులు, సాగు ఖర్చు తగ్గించి పంట దిగుబడులు పెంచడమే ప్రభుత్వ ఉద్దేశం
హైదరాబాద్, వెలుగు: భూసారాన్ని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. విచ్చలవిడిగా రసాయనిక ఎరువులు వాడడం వల్ల నేల సారం దెబ్బతిని పంట దిగుబడి తగ్గుతుంది. ఈ సమస్యను అధిగమించాలన్న ఉద్దేశంతో భూసార పరీక్షలు నిర్వహించేందుకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 30 వేల మంది భూసార వలంటీర్లను సిద్ధం చేస్తోంది. వచ్చే మూడు నెలల్లో 4 లక్షల మట్టి నమూనాలను సేకరించి, పరీక్షించాలని టార్గెట్ పెట్టింది. నేల స్వభావం, పంటల అనుకూలత, ఎరువుల సరైన మోతాదు వంటి వివరాలను రైతులకు అందించనున్నారు. వ్యవసాయ శాఖ నేతృత్వంలో సాగు ఖర్చు తగ్గించి, దిగుబడులు పెంచే దిశలో ప్రణాళికలు రూపొందించారు. ప్రతి ఎకరా భూసార పరిస్థితిని అంచనా వేసి రైతులకు భరోసా కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామాల్లో ఆసక్తి ఉన్న ఆదర్శ, యువ రైతులను వలంటీర్లుగా ఎంపిక చేసి ప్రత్యేక ట్రైనింగ్ ఇచ్చి భూసార పరీక్షల కోసం ఉపయోగించనున్నారు. ఈ మెగా ప్రాజెక్టును పకడ్బందీగా నిర్వహించేందుకు అంతర్జాతీయ సంస్థ ఇక్రిశాట్, జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, పలు ప్రైవేట్ కంపెనీల భాగస్వామ్యంతో ఆధునిక సాంకేతికతను వినియోగించి మట్టి పరీక్షలను వేగవంతం చేయనున్నారు. ప్రధాన కేంద్రంగా రాజేంద్రనగర్ వ్యవసాయ పరిశోధనా సంస్థ ఉండగా, అన్ని జిల్లాల్లో ప్రాంతీయ భూసార పరీక్షా కేంద్రాలు కొలువుదీరాయి. ముఖ్యంగా కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్ వంటి పట్టణాల్లో అత్యాధునిక ల్యాబ్‌లు రైతులకు సేవలు అందిస్తున్నాయి. వీటితో పాటు ఆయా జిల్లాల్లోని కృషి విజ్ఞాన కేంద్రాలు (కేవీకే), వ్యవసాయ పరిశోధనా కేంద్రాల్లో కూడా మట్టిని విశ్లేషించే సదుపాయం ఉంది. మొబైల్ సాయిల్ టెస్టింగ్ ల్యాబ్‌లను కూడా అందుబాటులోకి తెచ్చింది. ప్రైవేట్ భాగస్వామ్యంతో మరిన్ని క్లస్టర్ స్థాయి ల్యాబ్‌లను ఏర్పాటు చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
భూసార హెల్త్ కార్డు రాబోతోంది… ఏ పంట వేయాలో క్లియర్ గైడ్!
భూసార పరీక్షల ఆధారంగా రైతులకు పంటల ఎంపికపై స్పష్టమైన మార్గదర్శకాలు అందించేందుకు ప్రభుత్వం ‘భూసార హెల్త్ కార్డు’ను కీలకంగా తీసుకొస్తోంది. ఈ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయడానికి వాలంటీర్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనుంది. మొదట పైలట్ ప్రాజెక్ట్‌గా కొడంగల్ నియోజకవర్గంలో 128 మంది వలంటీర్లకు ఈ నెల 6న ఇక్రిశాట్‌లో ట్రైనింగ్ నిర్వహించనున్నారు. మట్టి నమూనాల సేకరణలో పాటించాల్సిన పద్ధతులు, విశ్లేషణా విధానాలపై పూర్తిస్థాయి అవగాహన కల్పించనున్నారు. అనంతరం ఈ నెల 8 నుంచి వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మరో 1000 మందికి శిక్షణ తరగతులు ప్రారంభం కానున్నాయి. దశలవారీగా మొత్తం 30 వేల మంది వలంటీర్లకు శిక్షణ పూర్తి చేసి, గ్రామాల వారీగా పంపాలని వ్యవసాయ శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. మట్టి నమూనాలు సేకరించే సమయంలో జియో ట్యాగింగ్ వంటి ఆధునిక విధానాలను కూడా వినియోగించనున్నారు. శిక్షణ పొందిన వలంటీర్లు గ్రామాల్లో రైతులకు అందుబాటులో ఉండి సాగు సలహాలు ఇవ్వనున్నారని అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా భూసార హెల్త్ కార్డులు ఈ కార్యక్రమంలో కీలక పాత్ర పోషించనున్నాయి. మట్టి పరీక్ష ఫలితాల ఆధారంగా ఏ పంటలు వేస్తే అధిక దిగుబడి వస్తుందో స్పష్టంగా సూచనలు ఇవ్వనున్నారు. రసాయనిక ఎరువుల అధిక వినియోగంతో భూమి నిస్సారమవుతున్న తరుణంలో ఈ నివేదికలు రైతులకు దిక్సూచిలా పని చేస్తాయని అధికారులు పేర్కొంటున్నారు. భూమిలో ఉన్న పోషకాల స్థాయిని తెలుసుకోవడం వల్ల అవసరానికి మించి యూరియా, డిఏపీ వంటి ఎరువులు వాడాల్సిన అవసరం తగ్గుతుంది. దీంతో రైతుల పెట్టుబడి ఖర్చులు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా సూక్ష్మ పోషకాలైన జింక్, బోరాన్, ఇనుము వంటి లోపాలను గుర్తించి సరిచేయడం వల్ల పంట నాణ్యత, దిగుబడి పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు.
