సోలార్ రోడ్డు.. పగులుతోంది

సోలార్ రోడ్డు.. పగులుతోంది

మూడేళ్లలోనే 10 శాతం డ్యామేజీ.. లక్ష్యంలో సగం కరెంటూ వస్తలేదు

ఫ్రాన్స్‌‌‌‌లో వేసిన ప్రపంచపు తొలి సోలార్‌‌‌‌ రోడ్డు పగిలిపోతోంది. వేసి మూడేళ్లు కూడా కాలేదు అప్పుడే 10 శాతం రోడ్డు పాడైపోయింది. పైగా ఉత్పత్తి చేయాల్సిన కరెంటులో సగం కూడా వస్తలేదు. మొత్తంగా రోడ్డుపై ఫ్రెంచ్‌‌‌‌ సర్కారు ఆశలు అడియాసలయ్యాయి.

2016 డిసెంబర్‌‌‌‌లో స్టార్ట్‌‌‌‌

ఫ్రాన్స్‌‌‌‌లోని నోర్మండిలో ఉన్న టోరోవ్రే టౌన్‌‌‌‌లో 2016 డిసెంబర్‌‌‌‌లో ‘వాట్‌‌‌‌వే’ సోలార్‌‌‌‌ రోడ్డును అందుబాటులోకి తీసుకొచ్చారు. రూ. 37 కోట్లు ఖర్చు చేసి 1 కిలోమీటర్‌‌‌‌ రోడ్డేశారు. ఇందుకు 30 వేల చదరపు అడుగుల సోలార్‌‌‌‌ ప్యానళ్లను వాడారు. ప్రపంచంలోనే అతి పొడవైన సోలార్‌‌‌‌ రోడ్డుగా గుర్తింపు పొందింది. ఆ టైంలో ఫ్రెంచ్‌‌‌‌ సర్కారు అదో అద్భుతమని పొగిడింది. ఫొటో వోల్టాయిక్‌‌‌‌ ప్యానళ్లతో రోడ్డేశామని, టోరోవ్రే టౌన్‌‌‌‌లోని వీధి లైట్లకు దీన్నుంచే పవరొస్తుందని చెప్పింది. వచ్చే ఐదేళ్లలో దేశంలోని ప్రతి వెయ్యి కిలోమీటర్లకు ఒక కిలోమీటర్‌‌‌‌ రోడ్డును ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు కూడా ప్రకటించింది.

సిలికాన్‌‌‌‌ షీట్లతో కప్పినా..

సోలార్‌‌‌‌ ప్యానళ్లను రెసిన్‌‌‌‌తో తయారు చేసిన సిలికాన్‌‌‌‌ షీట్లతో కప్పామని, ఎలాంటి ట్రాఫిక్‌‌‌‌నైనా తట్టుకుంటాయని రోడ్డేసిన కోలా కంపెనీ అప్పట్లో చెప్పింది. కానీ రోడ్డేసి మూడేళ్లు కూడా కాలేదు. చాలా భాగం ముక్కలైంది. 2018 మే నాటికి 90 మీటర్ల మేర రోడ్డు పాడైపోయింది. దీనికి చాలా కారణాలున్నట్టు తెలిసింది. బరువైన ట్రక్కులు, ట్రాక్టర్లను రోడ్డు తట్టుకోలేకపోయిందని స్థానికులు చెబుతున్నారు. ప్యానళ్లపై పడే ఆకుల వల్ల జరిగే నష్టాన్ని ఇంజినీర్లు గుర్తించలేకపోయుంటారని అంటున్నారు. ఉరుముల వల్ల కూడా రోడ్డు నాశనమైనట్టు తెలిసింది. ఏడాదికి 1.5 లక్షల కిలోవాట్ల కరెంటు ఉత్పత్తి లక్ష్యంగా రోడ్డేశారు. దీంతో రోజూ 5 వేల మందికి కావాల్సిన కరెంటివ్వొచ్చని భావించారు. కానీ 2018లో కేవలం 80 వేల కిలోవాట్ల కరెంటే ఉత్పత్తి అయింది. 2019 జులై వరకు 40 వేల కిలోవాట్లే వచ్చింది. దీనికి చాలా కారణాలున్నాయి. సోలార్‌‌‌‌ రోడ్డు ఏర్పాటు చేసిన నోర్మండిలో ఎక్కువ సూర్యరశ్మి ఉండదు. ఏడాదిలో 44 రోజులే సూర్యకాంతి పడుతుంది. ప్యానళ్ల డ్యామేజ్‌‌‌‌పై వాట్‌‌‌‌వే మేనేజింగ్‌‌‌‌ డైరెక్టర్ ఎటియెన్నే గాడిన్‌‌‌‌ మాట్లాడారు. అన్ని రకాల ట్రాఫిక్‌‌‌‌ను తట్టుకునేంతగా సోలార్‌‌‌‌ ప్యానళ్లను రెడీ చేయలేకపోయామని చెప్పారు.