ప్రేమ పెళ్లికి ఒప్పుకోలేదని.. యువతి తల్లిపై జవాన్ కాల్పులు

ప్రేమ పెళ్లికి ఒప్పుకోలేదని.. యువతి తల్లిపై జవాన్ కాల్పులు

అమరావతి, వెలుగు: ప్రేమ పెళ్లికి ఒప్పుకోలేదని ఓ జవాన్ యువతి తల్లిపై కాల్పులు జరిపిన ఘటన ఏపీలోని గుంటూరు జిల్లాలో శనివారం జరిగింది. చెరుకుపల్లి మండలం నడింపల్లిలో రమాదేవి కుటుంబం నివాసం ఉంటోంది. కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెం గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ బాలాజీ ప్రేమిస్తున్నానంటూ రమాదేవి కూతురు వెంట పడేవాడు. సెలవుపై ఇంటికి వచ్చిన ప్రతిసారి వేధింపులకు పాల్పడేవాడు. యువతి ప్రేమకు ఒప్పుకోకపోవడంతో ఆమె తల్లి దగ్గరకు వెళ్లి పెళ్లి చేయాలని అడిగాడు. పెళ్లి చేయడం కుదరదని తేల్చి చెప్పడంతో రమాదేవి కుటుంబంపై  పగ పెంచుకున్నాడు. శనివారం తెల్లవారుజామున రమాదేవి ఇంటి తలుపుతట్టాడు. తలుపు తీయగానే నాటు తుపాకితో రమాదేవిపై రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. తప్పించుకునేందుకు ప్రయత్నించిన రమాదేవి చెవిని తాకుతూ బుల్లెట్ దూసుకెళ్లింది. నొప్పిని తట్టుకోలేక రమాదేవి గట్టిగా కేకలు వేసింది. చుట్టుపక్కల వాళ్లు రావడంతో బాలాజీ తుపాకిని అక్కడే పడేసి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు.  నాటు తుపాకి, బ్యాగును స్వాధీనం చేసుకున్నారు. గాయపడిన మహిళను హాస్పిటల్ కు తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు బాలాజీపై కేసు నమోదు చేశారు. నిందితుడు పరారీలో ఉన్నాడని, అతడిని తీసుకొచ్చిన ఆటో డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు.