
హైదరాబాద్, వెలుగు: దివ్యాంగుల సమస్యలను, హక్కులను కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయి మేనిఫెస్టోలో ప్రత్యేకంగా ప్రస్తావించిందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. వారి సమస్యల పరిష్కారానికి కట్టబడి ఉన్నామని వెల్లడించారు. శనివారం ఆయన గాంధీ భవన్లో దివ్యాంగులతో సమావేశమయ్యారు. దివ్యాంగుల సమస్యలను అన్ని రాష్ట్రాల్లోని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెడతామని చెప్పారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్లి దివ్యాంగుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లాకు చెందిన తీగల భూమ్ లింగం గౌడ్.. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దీప్ దాస్ మున్షీ ఆధ్వర్యంలో కాంగ్రెస్లో చేరారు. కాగా, ఉత్తరప్రదేశ్లో ఇద్దరు బాలికలపై అత్యాచారాలు జరగటం దారుణమని పీసీసీ మహిళ సేవాదల్ అధ్యక్షురాలు భవాని త్రివేది నేతలు అన్నారు. శనివారం వారు గాంధీ భవన్లో నిరసన చేపట్టారు. కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ నిర్లక్ష్యం వల్లే బాలికలపై అత్యాచారం జరిగిందని ఆరోపించారు.