ఉద్యోగులకు కరోనా అలవెన్సులు

ఉద్యోగులకు కరోనా అలవెన్సులు

బిజినెస్‌‌డెస్క్‌‌, వెలుగు: ప్రస్తుత సంక్షోభ సమయంలో కంపెనీలు తమ ఉద్యోగుల బాగోగులను చూసుకుంటున్నాయి. కరోనా పరిస్థితులను ఎదుర్కొనేందుకు అదనంగా జాబ్‌‌ బెనిఫిట్స్‌‌ను అందిస్తున్నాయి. కొన్ని కంపెనీలు శాలరీలో 50 శాతాన్ని అడ్వాన్స్‌‌గా ఇస్తుండగా, మరికొన్ని కంపెనీలు కరోనా ఖర్చుల కోసం ముందుగానే డబ్బులిస్తున్నాయి. అంతేకాకుండా తమ ఉద్యోగులకు ఫ్రీగా వ్యాక్సిన్‌‌ వేయిస్తున్నాయి. వర్క్ ఫ్రమ్‌‌ హోమ్‌‌ బెనిఫిట్స్‌‌ను పెంచుతున్నాయి. కరోనా వచ్చిన ఉద్యోగులకు ఒకేసారి రూ. 15,000 సాఫ్ట్‌‌వేర్‌‌‌‌ కంపెనీ సేల్స్‌‌ఫోర్స్‌‌ ఇస్తోంది.  కిందటేడాది వర్‌‌‌‌ ఫ్రమ్‌‌ హోమ్‌‌ టూల్స్‌‌ను కొనుక్కోవడానికి ఒక్కో ఉద్యోగికి  250 డాలర్ల (రూ. 18,000) ను ఇచ్చిన ఈ కంపెనీ, ఈ ఏడాది మరో 250 డాలర్లను ఇచ్చింది. ఉద్యోగుల పెయిడ్ లీవ్స్‌‌ను పెంచింది. మరో సాఫ్ట్‌‌వేర్‌‌‌‌ కంపెనీ వీఎంవేర్‌‌‌‌  ఉద్యోగులకు రూ. 29,565 లను కరోనా అలవెన్స్‌‌ (వెల్‌‌వీయింగ్ అలవెన్స్‌‌)గా ఇస్తోంది. ఉద్యోగులు హోమ్‌‌ క్వారంటైన్‌‌లో ఉంటే వారి ఖర్చులను రూ. 20 వేల వరకు రియింబర్స్‌‌ చేస్తామని బజాజ్‌‌ అలియాంజ్‌‌ లైఫ్‌‌ ఇన్సూరెన్స్‌‌ పేర్కొంది. ఒకవేళ హాస్పిటల్‌‌లో చేరాల్సి వస్తే ఉద్యోగులకు అడ్మిషన్‌‌ దొరకడంలో, పాలసీ క్లయిమ్‌‌లో సాయం చేస్తామని పేర్కొంది. 

రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ తమ ఉద్యోగుల కోసం అనేక బెనిఫిట్స్‌‌ను అందిస్తోంది. యాన్యువల్‌‌ బోనస్‌‌లో 50 శాతాన్ని  ఈ నెల శాలరీ కింద పొందే అవకాశాన్ని కలిగిస్తోంది. అంతేకాకుండా ఆరు నెలల వరకు శాలరీని(వడ్డీ లేకుండా)  ముందుగానే ఇస్తామని తెలిపింది. వీటికి అదనంగా మెడికల్ పాలసీలో కవర్ కాని కరోనా ఖర్చులను రియింబర్స్ చేస్తామని పేర్కొంది.   ఉద్యోగులకు ఒకేసారి రూ. 10,000 ఇస్తున్నామని  సన్‌‌లైఫ్‌‌ తెలిపింది. టార్గెట్‌‌ ఇండియా తమ ఉద్యోగులకు అదనంగా పెయిడ్‌‌ సిక్‌‌ లీవ్స్‌‌ను అందిస్తోంది. ఉద్యోగులకు, వారి ఫ్యామిలీకి ఒక్కో మెంబర్‌‌‌‌కి చొప్పున రూ. 5 లక్షల వరకు  ఇన్సూరెన్స్‌‌ కవరేజిని అందిస్తామని ఐబీఎం పేర్కొంది. 

ఉద్యోగి చనిపోతే కుంటుంబాలకు అండగా..

ఉద్యోగులు కరోనా వలన చనిపోతే వారి కుటుంబాలకు ఆర్థిక సాయాన్ని, ఇతరత్రా బెనిఫిట్స్‌‌ను  కంపెనీలు అందిస్తున్నాయి. వారి పిల్లల చదువులకు అండగా ఉంటున్నాయి.  హాస్పిటల్‌‌ ఖర్చులు, ఉద్యోగి దహన సంస్కారాలు, కుటుంబాలకు రెండేళ్ల వరకు ఉద్యోగి ఫుల్ శాలరీని అందిస్తున్నాయి. కరోనా వలన ఉద్యోగి చనిపోతే వారి కుటుంబాలకు రూ. 23 లక్షల ఇన్సూరెన్స్‌‌ కవరేజిని టీసీఎస్ ప్రొవైడ్ చేస్తోంది. లేదా ఉద్యోగి శాలరీకి ఆరు రెట్లు ఎక్కువ కవరేజి పాలసీని ఇస్తోంది. కరోనా వలన ఉద్యోగి మరణిస్తే, ఆ ఉద్యోగి కుటుంబ సభ్యులకు  24 నెలల శాలరీని ముత్తూట్‌‌ ఫైనాన్స్‌‌ అందిస్తోంది. కంపెనీలో జాయిన్‌‌ అయి మూడేళ్లు కూడా పూర్తికాని ఉద్యోగుల విషయంలో 12 నెలల శాలరీని వారి కుటుంబాలకు ఇస్తోంది. కరోనా వలన ఉద్యోగి చనిపోతే, ఆ ఉద్యోగి  భార్య లేదా భర్తకు ఆ జాబ్‌‌ను ఐసీఐసీఐ లొంబర్డ్ ఆఫర్‌‌‌‌ చేస్తోంది. వారికి తగిన ఎడ్యుకేషన్‌‌ క్వాలిఫికేషన్ ఉండి, ఆ రోల్‌‌కు సరిపోతారనుకుంటే  ఈ జాబ్స్ ఇస్తోంది. హెచ్‌‌సీఎల్‌‌ టెక్నాలజీస్‌‌  తమ ఉద్యోగి కరోనా వలన చనిపోతే ఆ ఉద్యోగి కుటుంబ సభ్యులకు రూ. 30 లక్షల వరకు ఇన్సూరెన్స్‌‌ను ఆఫర్ చేస్తోంది. రూ. 7 లక్షల డిపాజిట్‌‌కు లింక్‌‌ అయిన ఇన్సూరెన్స్‌‌ను, ఉద్యోగి ఏడాది శాలరీని కుటుంబ సభ్యులకు ఇస్తోంది. నలుగురు ఉద్యోగులు కరోనా వలన చనిపోయారని, వారి పిల్లల చదువుల బాధ్యతను తీసుకుంటామని  గ్లాస్‌‌లను తయారు చేసే బోరోసిల్‌‌ లింక్డిన్‌‌లో ప్రకటించింది. కరోనా వలన ఉద్యోగి చనిపోతే వారి కుటుంబాలకు, ఆ ఉద్యోగి ఏడాది శాలరీకి సరిపోయే ఇన్సూరెన్స్‌‌ కవరేజిని అందిస్తామని కే రహేజా కార్పొరేషన్ పేర్కొంది.