- మంత్రి హెచ్చరించినా మారని సిబ్బంది
- ఇబ్బందులు పడుతున్న పేషెంట్లు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సర్కార్ దవాఖాన్లకు వచ్చే పేషెంట్ల పట్ల కొందరు డాక్టర్లు, సిబ్బంది అదే నిర్లక్ష్యం చూపుతున్నారు.పద్ధతి మార్చుకోవాలని ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు హెచ్చరించినా కొందరు డాక్టర్లు, సిబ్బంది పట్టించుకోవడం లేదు. డిసెంబర్ 24న జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రికి ఓ గర్భిణి కాన్పు కోసం వెళ్లగా, డెలివరీకి ఇంకా టైమ్ ఉందంటూ డాక్టర్లు ఆమెను అడ్మిట్ చేసుకోలేదు. ఆరోగ్య పరిస్థితి బాగాలేదని, అడ్మిట్ అవుతానని కోరినా పట్టించుకోకుండా.. సిబ్బంది ఆమెను బలవంతంగా బయటకు పంపారు.
ఆ తర్వాత రెండో రోజే ఆ మహిళకు నొప్పులు ఎక్కువై రోడ్డుపైనే ప్రసవించింది. ఆమె బాధను చూసి చలించిన స్థానికులు అదే హాస్పిటల్ కుతరలించారు. అదృష్టవశాత్తు తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నారు.ఒకవేళ ఆమెకు ఏదైనా జరిగి ఉంటే పరిస్థితి ఏమిటని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నవంబర్ లో నల్గొండ ప్రభుత్వ ఆస్పత్రిలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. పురిటినొప్పులతో బాధపడుతున్న భార్యను ఓ వ్యక్తి కారులో ఆస్పత్రికి తీసుకొచ్చాడు. అక్కడి సిబ్బందికి, పరిస్థితి సీరియస్ గా ఉందని డాక్టర్లకు చెప్పినా పట్టించుకోలేదు. దీంతో ఆ మహిళ కారులోనే ప్రసవించింది. తర్వాత డాక్టర్లు, సిబ్బంది వచ్చి ఆమెను లోపలికి తీసుకెళ్లారు.
ఒకరి బిడ్డ మరొకరికి
ఈ ఘటనలు మరువకముందే మంచిర్యాల ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో నర్సులు చేసిన మరో నిర్లక్ష్యపు ఘటన బయటపడింది. మంచిర్యాల జిల్లాకు చెందిన మమత, అసిఫాబాద్ జిల్లాకు చెందిన పావని కాన్పు కోసం మంచిర్యాల దవాఖానలో చేరారు. మంగళవారం రాత్రి ఇద్దరికీ సిజేరియన్ చేశారు. ఒకరికి బాబు, మరొకరికి పాప పుట్టారు. పిల్లాడిని తీసుకెళ్లి మమత కుటుంబ సభ్యులకు, పాపను తీసుకెళ్లి పావని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
మమత కుటుంబ సభ్యులు బాబును పిల్లల డాక్టర్ కు చూపించి, టీకా వేయించుకొచ్చారు. ఆ తర్వాత నర్సులు వచ్చి మీకు బాబు కాదు.. పాప పుట్టిందనిచెప్పారు. బాబు పావనికి పుట్టాడని, మమతకు పాప పుట్టిందన్నారు. దీంతో గొడవ స్టార్ట్అయింది. మమతకు పుట్టింది పాపే అని డాక్టర్లు చెప్పినా వాళ్లు ఒప్పుకోవడం లేదు. దీ పంచాయతీ పోలీసు స్టేషన్ కు వెళ్లగా.. పిల్లలిద్దరినీ శిశు సంక్షేమశాఖ అధికారులకు అప్పగించారు. ఇప్పుడు డీఎన్ఏ టెస్టులు చేసి ఎవరి బిడ్డ ఎవరో తేల్చాల్సిన పరిస్థితి వచ్చింది.
నిమ్స్ లో నిర్లక్ష్యం నిత్యకృత్యంగా మారింది. గుండె సమస్యతో 20 రోజుల క్రితం దవాఖానకు వచ్చిన ఫయాజ్ కు ఆపరేషన్ వాయిదా వేస్తూ వచ్చి, బుధవారం తేదీ ఫిక్స్ చేశారు. మధ్యాహ్నం ఒంటిగంటకు ఆపరేషన్ థియేటర్ లోకి వెళ్లిన ఫయాజ్.. ఆపరేషన్ ఫెయిలై చనిపోయాడు. ఈ విషయాన్ని డాక్టర్లు కుటుంబ సభ్యులకు చెప్పలేదు. ఓసారి ఆపరేషన్ సక్సెస్ అయిందని, కండీషన్ బాగుందని.. మరికాసేపటికి సీరియస్ గా ఉందని చెప్పారు. చివరకు గురువారం తెల్లవారుజామున 4 గంటలకు ఫయాజ్ చనిపోయాడని డాక్టర్లు చెప్పారని కుటుంబ సభ్యులు తెలిపారు.
పైసల కోసం పీడిస్తున్నా.. చర్యల్లేవ్
ప్రభుత్వ దవాఖాన్లలో డెలివరీలు ఉచితంగా చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, ప్రతి డెలివరీకి ఓ లెక్కగట్టిసిబ్బంది వసూళ్లకు పాల్పడుతున్నారు. మగ బిడ్డ పుడితే రూ.2వేల నుంచి రూ.3వేలు, ఆడ బిడ్డ పుడితే రూ.వెయ్యి నుంచి రూ.2వేలు తీసుకుంటున్నారు. ఇవ్వకపోతే ఆడిపోసుకుంటున్నారు. బిడ్డకు తల్లికిశాపనార్ధాలు పెడుతున్నారు. కిందిస్థాయి సిబ్బందే కాదు.. కొందరు డాక్టర్లుసైతం పేషెంట్ల వద్ద డబ్బులు వసూలు చేస్తున్న ఘటనలు ఇటీవల వెలుగు చూశాయి. కొండాపూర్ ఆస్పత్రిలో ఓ పేషఎంట్ వద్ద రూ.500 తీసుకుంటూ మంత్రి హరీష్ రావుకే దొరికిపోయాడు ఓ డాక్టర్. అయినా, అతనిపై చర్యలు తీసుకోలేదు. నిమ్స్ లో ఓ డిప్యూటీ సూపరింటెండెంట్ పేషెంట్ల వద్ద డబ్బులు, లిక్కర్ బాటిళ్లు తీసుకున్నా.. ఆయనపై చర్యల్లేవు.
నిమ్స్ డాక్టర్ల మధ్య కోల్డ్ వార్
నిమ్స్ హాస్పిటల్ కు సంబంధించిన ఓ పాత విషయం గురువారం బయటకొచ్చింది. 2021లో నిమ్స్ కు వచ్చిన ఓ పేషెంట్ కు సర్జరీ చేయాలని న్యూరాలజీ డాక్టర్లు నిర్ణయించారు. చివరి నిమిషంలో సర్జరీ క్యాన్సిల్ అయింది. డిశ్చార్జి సమ్మరీలో మాత్రం కుట్లు విప్పించుకోవడానికి 2 నెలల తర్వాత మళ్లీ రావాలని రాసిచ్చారు. ఆ పేషెంట్ కు మళ్లీ అదే సమస్య రావడంతో బుధవారం ఉస్మానియాకు వెళ్లాడు. అక్కడి డాక్టర్లు నిమ్స్ లో ఇచ్చిన డిశ్చార్జి సమ్మరీ చూసి ఆపరేషన్ అయినట్లుగా రాశారు.
నిమ్స్ కే వెళ్లాలని చెప్పారు. దీంతో షాక్ అయిన పేషెంట్ విషయాన్ని మీడియాకు చెప్పాడు. ఏడాదిన్నర క్రితం జరిగిన ఈ విషయం ఇప్పుడు బయటకు రావడానికి డాక్టర్ల మధ్య నడుస్తున్న కోల్డ్ వారే కారణమని తెలుస్తోంది. న్యూరాలజీ విభాగంలో ఎక్విప్ మెంట్ కొనుగోలులో అక్రమాలు జరిగాయని, ఇందులో ఉస్మానియా న్యూరాలజీ విభాగంలోని ఓ సీనియర్ ప్రొఫెసర్ హస్తం ఉందని నిమ్స్ డాక్టర్లు ఆరోపిస్తున్నారు. దీనిపై ప్రశ్నించినందుకు తమపై నిందలు వేసి బయటకు పంపే కుట్ర చేస్తున్నారని నిమ్స్ న్యూరాలజీ డాక్టర్లు చెబుతున్నారు.