వేదాంత గట్టెక్కుతుందా?

 వేదాంత గట్టెక్కుతుందా?

న్యూఢిల్లీ : భారీగా అప్పులు తీసుకున్న కొంత మంది మన బిజినెస్​ టైకూన్స్ మార్కెట్లో కొంత ఇబ్బంది పడుతున్నారు. 236 బిలియన్​ డాలర్ల విలువైన ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ ఎంపైర్​ కట్టిన గౌతమ్​ అదానీ తన సంపదలో అయిదింట మూడొంతులను నెల రోజుల్లోనే పోగొట్టుకున్నారు.  ఇంత పెద్ద సమస్య కాకపోయినా, మరో బిజినెస్​ టైకూన్​ కూడా చిక్కుల్లో పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు లండన్​లో లిస్టింగ్​ పొందిన అనిల్​ అగర్వాల్​ కంపెనీ వేదాంత రిసోర్సెస్​ లిమిటెడ్​ అప్పులు భారీగా పెరిగాయి. ఈ ఏడాది జనవరిలో చెల్లించాల్సిన బిలియన్​ డాలర్ల బాండ్స్​ మొత్తం  కూడా ఇందులో కలిసే ఉంది.  అమెరికా ఫెడరల్​ రిజర్వ్​ వడ్డీ రేట్లను పెంచడానికి..రష్యా–ఉక్రెయిన్​ యుద్ధం మొదలవడానికి ముందు అంటే కిందటేడాది ఇదే టైములో కమోడిటీస్​ ధరలు ముప్ఫై ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఒకే క్వార్టర్లో పెరిగాయి.  సరిగ్గా ఆ టైములోనే అప్పులలో కూరుకుపోయిన వేదాంత రిసోర్సెస్​ లిమిటెడ్​ను బాగా డబ్బులున్న ముంబై లిస్టెడ్​ కంపెనీ వేదాంత లిమిటెడ్​తో విలీనం చేద్దామని అనిల్​ అగర్వాల్​ ప్లాన్​ చేశారు. అప్పట్లోనే బ్లూమ్​బర్గ్​ ఈ ప్లాన్​ను రిపోర్టు చేసింది కూడా. కానీ, ఈ ప్లాన్​ ఎందువల్లో ముందుకు సాగలేదు.

రాబోయే కొన్ని వారాలు చాలా ముఖ్యం...

ఇప్పటిదాకా చూస్తే తన 10 బిలియన్​ డాలర్ల అప్పును 8 బిలియన్​డాలర్లకు వేదాంత రిసోర్సెస్​ తగ్గించుకోగలిగింది. అలాగే ఈ ఏడాది సెప్టెంబర్​ దాకా అప్పులు– వాటిపై వడ్డీలను వేదాంత రిసోర్సెస్​ చెల్లించగలుగుతుందని ఎస్​ అండ్​ పీ గ్లోబల్​ ఇంక్​ అంచనా వేస్తోంది. ఆ తర్వాత అంటే సెప్టెంబర్​ 2023 – జనవరి 2024 మధ్యలో ఈ కంపెనీ  1.5 బిలియన్​ డాలర్లను  తిరిగి చెల్లించాల్సి ఉంటుందని, అప్పుడు కొన్ని చిక్కులు ఎదురయ్యే అవకాశాలున్నాయని ఎనలిస్టులు చెబుతున్నారు. కొత్త ఫండ్స్​ సమీకరణ విషయంలో రాబోయే కొన్ని వారాలు వేదాంత గ్రూప్​కు చాలా ముఖ్యమైన కాలం. ఏదైనా తేడా జరిగితే క్రెడిట్​ రేటింగ్​ పడిపోయే ప్రమాదం ఉంటుందని ఎనలిస్టులు పేర్కొంటున్నారు.