
లీడ్స్: అసాధారణ బౌలింగ్ యాక్షన్ కారణంగా తరచు గాయాల బారిన పడుతుండటంతో ఎనిమిది నుంచి పది నెలల్లోనే తన కెరీర్ ముగుస్తుందని అప్పట్లో కొంత మంది జోస్యం చెప్పారని టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అన్నాడు. విమర్శకులు ఎలా మాట్లాడినా ఆత్మవిశ్వాసంతో తాను పదేళ్ల కెరీర్ను పూర్తి చేసుకున్నానని చెప్పాడు. ‘ఈ పదేళ్ల కాలంలో ప్రజలు చాలా మాట్లాడారు. 8 నుంచి 10 నెలలు ఆడితే గొప్ప అన్నారు.
కానీ నేను 10 ఏళ్ల ఇంటర్నేషనల్ కెరీర్, 12–13 ఏళ్ల ఐపీఎల్ కెరీర్ను పూర్తి చేశా. అయినా ఇప్పటికి కూడా పెద్ద ఇంజ్యురీ అయిన ప్రతిసారి బుమ్రా పని అయిపోయిందని చెబుతారు. ఇక రావడం కష్టమే అని వ్యాఖ్యానాలు చేస్తారు. అయినా వాటిని నేను పెద్దగా పట్టించుకోను. నా పని నేను చేసుకుంటూ వెళ్తా. ప్రతి నాలుగు నెలలకు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. కానీ దేవుడి దయ వల్ల నేను తిరిగి వస్తూనే ఉన్నా, ఇండియాకు ఆడుతూనే ఉన్నా. నా శక్తి మేరకు సిద్ధమవుతా. మిగతా విషయాలు దేవుడికి వదిలేస్తా’ అని బుమ్రా వివరించాడు. ప్రజల విమర్శలు మార్చడానికి తాను ఇక్కడికి రాలేదన్నాడు.