‘హెల్పింగ్​ హ్యాండ్స్’.. అమెరికా దోస్తులు ఆదుకుంటున్నరు

‘హెల్పింగ్​ హ్యాండ్స్’..  అమెరికా దోస్తులు ఆదుకుంటున్నరు

అమెరికాలో ఉద్యోగం రాంగనే.. ‘‘ఇగ సెటిల్‌ అయిపోయినం, బిందాస్‌’’ అని అనుకోలే ఈ దోస్తులు. మనం మంచిగున్నం.. నలుగురికి మంచి చేద్దాం అనుకున్నరు. ఆపదలో ఉన్నోళ్లను ఆదుకొని వాళ్ల కళ్లల్లో సంతోషం చూసి..సంతృప్తి పడాలనుకున్నరు. అందుకే,  ‘‘హెల్పింగ్​ హ్యాండ్స్” అనే గ్రూప్ స్టార్ట్ చేసిన్రు. ప్రతి నెలా జీతంల కెళ్లి కొన్ని డాలర్లు పక్కకు తీసి.. అవసరం ఉన్నోళ్లకు సాయం చేసుడు మొదలువెట్టిన్రు కొంతమంది తెలుగు పిలగాళ్లు!

మెదక్, నిజాంపేట, వెలుగు: సంతోష్​ లాల్‌‌ది హైదరాబాద్‌‌.  అమెరికాలోని సియాటెల్‌‌లో  విప్రోలో  సాఫ్ట్​వేర్ ఇంజినీర్‌‌‌‌గా పని చేస్తున్నడు. ‘అవసరం ఉన్నోళ్లకు.. మనవంతు ఏదైనా చెయ్యాలె’ అనుకొని దీనికోసం ‘‘హెల్పింగ్​ హ్యాండ్స్ గ్రూపు స్టార్ట్  చెయ్యాలె”అనే ఆలోచన తట్టింది సంతోష్‌‌కి.  ఈ విషయాన్ని  అక్కడే సాఫ్ట్​వేర్​గా పనిచేస్తున్న అతని దోస్తు సంతోష్​ నవాత్ కి చెప్పిండు. వీళ్లది  కామారెడ్డి జిల్లా పెద్ద మల్లారెడ్డి గ్రామం. ‘‘అరె ఐడియా మంచిగున్నద’’ని దోస్తుతో చేతులు కలిపిండు. వీళ్లిద్దరితో ఇంకో ముగ్గురు దోస్తులు చేతులు కలిపిన్రు. అట్ల 2019ల ‘హెల్పింగ్​ హ్యాండ్స్​’ షురూ అయింది.

జీతంలో కొంత

వీళ్లకు వచ్చే జీతంలో కొంత పక్కకు పెట్టి..  సాయానికి కేటాయించడం మొదలుపెట్టిన్రు. గ్రూప్‌‌లో ఎక్కువమంది చేరితే.. ఇంకా ఎక్కువ మందికి సాయం చేయొచ్చనుకున్రు. ఈ విషయాన్ని తమ సర్కిల్‌‌లో ఉన్న ఫ్రెండ్స్‌‌కి షేర్ చేసిన్రు. పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ గ్రూప్‌‌లో ఏపీ, తెలంగాణ నుంచి మొత్తం 22 మంది మెంబర్స్‌‌గా ఉన్నరు.

ఎవరికి సాయం?

కుటుంబ పరిస్థితి బాగాలేక.. బాల కార్మికులుగా మారిన పిల్లలకు, పెద్ద దిక్కు కోల్పోయిన ఫ్యామిలీస్‌‌కి, అనారోగ్యంతో సర్వం కోల్పోయిన కుటుంబాలకు, పిల్లలు పట్టించుకోక అనాథలుగా మారిన పెద్దవాళ్లకు సాయం చేయడం ఈ హెల్పింగ్‌‌ హ్యాండ్స్ ప్రధాన లక్ష్యం. ఇప్పటి వరకు తెలంగాణ, ఏపీల్లో మొత్తం 17  ఫ్యామిలీలకు ఈ గ్రూప్ సాయం చేసింది. కరోనా టైంలో పేదలకు తినడానికి అవసరమైన సరుకులు అందించారు. వరంగల్‌‌లో వచ్చిన వరదల వల్ల తీవ్రంగా నష్టపోయిన బాధితులను, వైజాగ్‌‌ అగ్నిప్రమాదంలో ఇళ్లు కోల్పోయిన బాధితులను ఆర్థికంగా ఆదుకున్నారు వీళ్లు.

ఎంతో హ్యాపీగా ఉంది

ఆపదలో ఉన్నవాళ్లను ఆదుకోవాలనే ఉద్దేశంతో అమెరికాలో సాఫ్ట్​వేర్​ ఉద్యోగం చేస్తున్న  ముగ్గురం ఫ్రెండ్స్‌ కలిసి ‘హెల్పింగ్​ హ్యాండ్స్​’ గ్రూప్​ స్టార్ట్ చేసినం. ప్రతి నెలా మా జీతంలో కొన్ని డాలర్లు జమ చేస్తున్నాం. ఈ డబ్బుతో ఏపీ తెలంగాణల్లో ఆపదలో ఉన్నవాళ్లను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం. గ్రూప్‌లో ముగ్గురం ఉన్నప్పుడు  ఐదు నుంచి రూ.10 వేలు మాత్రమే సాయం చేయగలిగేవాళ్లం. ఇప్పుడు 22 మంది ఉన్నారు. కాబట్టి, 50 వేలు, అంతకుమించి కూడా సాయం అందించగలుగుతున్నం. ఇది మాకు చాలా హ్యాపీగా ఉంది. – సంతోష్​ నవాత్​, సాఫ్ట్​వేర్​, అమెరికా