అవినీతి, అక్రమాల్లో కేసీఆర్​కు సోమేశ్ పెద్ద కొడుకులాంటోడు

అవినీతి, అక్రమాల్లో  కేసీఆర్​కు సోమేశ్ పెద్ద కొడుకులాంటోడు
  •     సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి

హనుమకొండ, వెలుగు: అవినీతి, అక్రమాలలో మాజీ సీఎస్ సోమేశ్ కుమార్.. బీఆర్ఎస్ ​అధినేత, మాజీ సీఎం కేసీఆర్​కు పెద్ద కొడుకులాంటి వాడని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి అన్నారు. తెలంగాణ చీఫ్ ​సెక్రటరీగా పని చేసిన టైంలో సోమేశ్ కుమార్ రూ.1,400 కోట్ల మేర జీఎస్టీ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయని, ఇంత జరిగినా కేసీఆర్ తన హయాంలో జరిగిన అక్రమాలపై స్పందించడం లేదని విమర్శించారు. 

హనుమకొండ బాలసముద్రంలోని సీపీఐ జిల్లా ఆఫీసులో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో చాడ మాట్లాడారు. ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట పడాలంటే తగిన శిక్షలు పడాలన్నారు. భూ ప్రక్షాళన జరగాలంటే ముందుగా రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన జరగాలని, సర్వే నంబర్ల వారీగా సమగ్రంగా సర్వే చేపట్టాలన్నారు. బడ్జెట్​లో నిధుల కోసం తెలంగాణ బీజేపీ ఎంపీలు కేంద్రంపై పోరాడాలని,  ముఖ్యమంత్రి కూడా అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరారు.

 సీపీఐ రాష్ట్ర నిర్మాణ కౌన్సిల్ సమావేశాలను ఆగస్టు 22, 23, 24 తేదీల్లో హనుమకొండలోని హరిత కాకతీయ హోటల్​లో నిర్వహించనున్నట్లు తెలిపారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నేదునూరి జ్యోతి, జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి, లీడర్లు సిరబోయిన కరుణాకర్,  తోట భిక్షపతి, మద్దెల ఎల్లేశ్,  మోతె లింగారెడ్డి  పాల్గొన్నారు.