మహబూబాబాద్అర్బన్, వెలుగు: దేశంలో నిరంతరం పేదల పక్షాన నిలబడి పోరాడి కమ్యూనిస్టుల ఐక్యత తక్షణ కర్తవ్యం అని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం మహబూబాబాద్ లయన్స్ భవనంలో భారత దేశంలో కమ్యూనిస్టుల ఐక్యత నేటి ఆవశ్యకత అనే అంశంపై విజయ సారథి అధ్యక్షతన జరిగిన సెమినార్లో ఆయన పాల్గొని ప్రసంగించారు.
కమ్యూనిస్టు పార్టీలు చీలిపోయి బలహీన పడడం వల్లనే దేశంలో మతోన్మాదులు పెరిగిపోయారని, కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దేశంలో రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేస్తుందన్నారు. ప్రజల పక్షాన నిలబడి పోరాడే కమ్యూనిస్టులు ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈనెల 18న ఖమ్మంలో జరుగు సీపీఐ జాతీయ శతవార్సికోత్సవాల ముగింపు ఉత్సవాలను జయప్రదం చేయాలన్నారు.
