ఎపి బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన సోము వీర్రాజు

ఎపి బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన సోము వీర్రాజు

విజయవాడ: ఎపి అధ్యక్షుడిగా  సోము వీర్రాజు బాధ్యతలు స్వీకరించారు. బీజేపీ జాతీయ నాయకులు, ముఖ్య అతిధుల సమక్షంలో కన్నా లక్ష్మినారాయణ నుండి అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. వెన్యూ ఫంక్షన్ హాలులో జరిగిన కార్యక్రమంలో అఖిల భారత ప్రధాన కార్యదర్శి వారణాసి రాంమాధవ్, అఖిల భారత సంఘటన సహా కార్యదర్శి సతీష్ జీ, ఏపీ రాష్ట్ర వ్యవహారాల సహా ఇంచార్జి  సునిల్ ధియోదర్, మధుకర్ జీ, కన్నా లక్ష్మీనారాయణ,  దగ్గుబాటి పురంధరేశ్వరి, సత్యకుమార్,ఎమ్మెల్సీ మాధవ్, విష్ణువర్ధన్ రెడ్డి, విష్ణుకుమార్ రాజు, పాతూరి నాగభూషణం, ఆదినారాయణ రెడ్డి, రావెల కిషోర్ బాబు, తురగా నాగభూషణం.. తదితర నేతలు పాల్గొన్నారు.

ముందు ఇటీవల మరణించిన మాజీ మంత్రి పైడికొండ మాణిక్యాలరావు కు బిజెపి నేతలు నివాళలర్పించారు. ప్రాణాలు  కోల్పోయిన జవాన్లు, ఇటీవల విజయవాడ కరోనా ఆస్పత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంలో  కరోనా పేషెంట్ ల  మృతికి సంతాపంగా రెండు నిమిషం మౌనం పాటించి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి మాట్లాడుతూ.. సంస్థాగతంగా చేసే మార్పులలో భాగంగా సోము వీర్రాజు ఎపి అధ్యక్షులు గా బాధ్యతలు స్వీకరించారని చెప్పారు. కరోనా లాక్ డౌన్ నిబంధనలు అమల్లో ఉన్నందున కొద్ది మంది సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. నిరుత్సాహానికి అవకాశం లేకుండా యూట్యూబ్ లింక్ ద్వారా లక్షల మంది అభిమానులు వీక్షించే ఏర్పాట్లు చేశామని వివరించారు.

బిజెపి రాష్ట్ర మాజీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ..  2018 మే 13న బిజెపి రాష్ట్ర అధ్యక్షునిగా నన్ను నియమించారని… పది మాసాలే గడువు ఉన్నా కమిటీ లు వేసుకుని ఎన్నికలకు వెళ్లామన్నారు. మళ్లీ సంస్థాగత ఎన్నికలు రావడంతో.. బూత్ కమిటీలు ఏర్పాటు చేశాం.. ఇప్పుడు కొత్త అధ్యక్షులు గా సోము వీర్రాజు బాధ్యత తీసుకున్నారు.. ఎపి లో బిజెపి బలోపేతం చేసేందుకు నా వంతు కృషి చేశాను.. నాకు ఎంతోమంది నేతలు సహకరించారు.. వారందరకీ నా ధన్యవాదాలు.. నా చర్యల వల్ల కొంతమంది కి కష్టం, నష్టం కలిగించినా… అది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు.. పార్టీ కోసం పని చేసే క్రమంలో బిజెపి ని ప్రజల్లోకి తీసుకుని వెళ్లేందుకు కృషి చేస్తా.. కొత్త అధ్యక్షులు సోము వీర్రాజు కు నా సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయన్నారు.