
- శృంగేరి జగద్గురు, పీఠాధిపతులను ఆహ్వానించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
వేములవాడ, వెలుగు: వేములవాడ రాజన్న ఆలయానికి రావాలని శృంగేరి జగద్గురు భారతి తీర్థ మహాస్వామి, శృంగేరి పీఠాధిపతి విధుశేఖర భారతి స్వామిని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆహ్వానించారు. శనివారం రాజన్న ఆలయ బృందం శృంగేరిలో వారిని కలిసింది. తెలంగాణ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో జరుగుతున్న పనులు, ప్రగతి వివరాలను వారికి వివరించి, ఆహ్వాన పత్రిక అందజేశారు.
దక్షిణ కాశీగా విరజిల్లుతున్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి క్షేత్ర విస్తరణ అభివృద్ధిలో భాగంగా.. స్వామివారి విజయ యాత్రను పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర పర్యటన ఉన్నందున రాజన్న సన్నిధికి రావాల్సిందిగా ఆహ్వానం పలికారు. వచ్చే మాసంలో తప్పకుండా ఆలయానికి వస్తామని వారి ఆశీస్సులను అందజేసినట్టు తెలిపారు. గతంలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాజన్న ఆలయ అభివృద్ధి, విస్తరణపై పలు మార్లు శృంగేరి పీఠాధిపతి విధుశేఖర భారతి స్వామి వారిని కలసి వారి సూచనలు సలహాల మేరకు ఇప్పటికే పనులు ప్రారంభించడం జరిగిందని, ప్రస్తుతం ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి విస్తరణ పనుల పురోగతిని స్వామివారికి వివరించినట్టు విప్ అది శ్రీనివాస్ తెలిపారు.
అనంతరం విప్ ఆది శ్రీనివాస్, రాజన్న ఆలయ బృందం శృంగేరి లోని శారద అమ్మవారిని దర్శించుకొని తుంగభద్ర నదిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారి వెంట రాజన్న ఆలయ ఈవో రమాదేవి, ఆలయ ఇన్చార్జ్ స్థానాచారి నమిలికొండ ఉమేశ్ శర్మ, చంద్రగిరి శరత్, శృంగేరి తెలంగాణ రాష్ట్ర బాధ్యులు రాధాకృష్ణ శర్మ ఉన్నారు.