కిచెన్ తెలంగాణ: సండే స్పెషల్ పరోటా డిన్నర్‌‌.. సింపుల్ రెసిపీస్ ఇవే.. !

కిచెన్ తెలంగాణ: సండే స్పెషల్ పరోటా డిన్నర్‌‌.. సింపుల్ రెసిపీస్ ఇవే.. !

ప్రస్తుతం ఉన్న ఆరోగ్య పరిస్థితుల రీత్యా రాత్రిపూట భోజనం చేసేవాళ్లు తగ్గుతూ వస్తున్నారు. ఆ టైంలో చాలామంది చపాతీ, పుల్కా, పరోటా వంటివి తినడానికి ఇష్టపడుతున్నారు. అయితే, పరోటాలు, వాటి సైడ్​ డిష్​ల్లోనూ ఎన్నో వెరైటీలు ఉన్నాయి. వాటిలో కొన్ని ఈ వారం స్పెషల్స్. రెండు అదిరిపోయే సైడ్​ డిష్​లతోపాటు బన్​ పరోటా రెసిపీని కూడా ఎలా తయారుచేయాలో ఇక్కడ చదివేయండి. 

సల్నా 

కావాల్సినవి :

  • నూనె, ఉప్పు, నీళ్లు – సరిపడా
  • సోంఫు, మిరియాలు, జీలకర్ర, పసుపు, ధనియాల పొడి, గసగసాలు – ఒక్కోటి అర టీస్పూన్
  • చిన్న ఉల్లిగడ్డ, టొమాటో, బిర్యానీ ఆకు – ఒక్కోటి, యాలకులు – ఆరు లవంగాలు – ఎనిమిది, వెల్లుల్లి రెబ్బలు – పది, పుదీనా – కొంచెం, దాల్చిన చెక్కలు – రెండు 
  • కారం – రెండు టీస్పూన్లు
  • అల్లం – చిన్న ముక్క
  • పచ్చి కొబ్బరి తురుము – ఒక కప్పు
  • జీడిపప్పులు – కొన్ని

తయారీ :

మిక్సీజార్​లో బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, మిరియాలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి రెబ్బలు, చిన్న ఉల్లిగడ్డ తరుగు వేసి మెత్తని పేస్ట్​లా గ్రైండ్ చేయాలి. పాన్​లో నూనె వేడి చేసి సోంఫు, ఒక దాల్చిన చెక్క, రెండు యాలకులు, నాలుగు లవంగాలు వేసి వేగించాలి. తర్వాత ఉల్లిగడ్డ, టొమాటో తరుగు, పుదీనా వేసి వేగించాలి. అందులో రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసి కలపాలి. తర్వాత ఉప్పు, పసుపు, ధనియాల పొడి వేసి కలిపాక నీళ్లు పోయాలి. పచ్చి కొబ్బరి తురుము, జీడిపప్పులు, గసగసాలు వేసి గ్రైండ్ చేయాలి. ఆ మిశ్రమాన్ని కూడా పాన్​లో వేసి కలపాలి. నీళ్లు పోసి మూతపెట్టి పదిహేను నిమిషాలు ఉడికించాలి. 

బన్​ పరోటా

కావాల్సినవి :

  • మైదా – అర కిలో
  • కోడిగుడ్డు – ఒకటి
  • చక్కెర, పాలు – ఒక్కోటి రెండు టేబుల్ స్పూన్లు
  • నీళ్లు – ఒక కప్పు
  • ఉప్పు, నూనె – సరిపడా


తయారీ :

ఒక గిన్నెలో కోడిగుడ్డు సొన, ఉప్పు, చక్కెర వేసి పాలు, నీళ్లు పోసి బాగా కలపాలి. మరో గిన్నెలో మైదా వేసి అందులో తయారుచేసుకున్న కోడిగుడ్ల సొన మిశ్రమం వేసి కలపాలి. చపాతీ ముద్దలా కలిపిన తర్వాత కొంచెం నూనె వేసి పైన క్లాత్​ కప్పి రెండు గంటలు పక్కన పెట్టాలి. ఆ తర్వాత పిండిని ఉండలుగా చేసి, మళ్లీ కొంచెం నూనె పూసి అరగంటపాటు పక్కనపెట్టాలి. తర్వాత చపాతీలా వత్తి, ఒకవైపు నూనె పూసి రుమాలీ రోటీ చేసినట్లు చేతులతోనే చపాతీని సాగదీయాలి. పల్చగా తయారయ్యాక  రెండు వైపులా మడత పెట్టి తర్వాత రోల్ చేసి చిన్న సైజు బన్​లా చేయాలి. పాన్​ వేడయ్యాక ఆ బన్​ పెట్టి నూనె వేసి రెండు వైపులా కాల్చాలి. 

వెళ్లై కుర్మా

కావాల్సినవి :

  • పచ్చికొబ్బరి తురుము – ఒక కప్పు
  • లవంగం, దాల్చిన చెక్క – రెండేసి చొప్పున 
  • యాలకులు – నాలుగు
  • బిర్యానీ ఆకు – ఒకటి
  • పల్లీలు – ఒక టేబుల్ స్పూన్
  • జీలకర్ర, వెల్లుల్లి, అల్లం పేస్ట్ – ఒక్కో టీస్పూన్
  •  సోంఫు – ఒక్కోటి రెండు టీస్పూన్లు
  • జీడిపప్పులు – ఐదు
  • పచ్చిమిర్చి – నాలుగు
  • నీళ్లు – సరిపడా
  • ఉల్లిగడ్డ తరుగు – రెండు కప్పులు
  • క్యారెట్, ఆలుగడ్డ – ఒక్కోటి 
  • బీన్స్ తరుగు – అర కప్పు
  • కాలిఫ్లవర్, బటానీలు – ఒక్కోటి పావు కప్పు


తయారీ :

మిక్సీజార్​లో పచ్చికొబ్బరి తురుము, ఒక లవంగం, ఒక దాల్చిన చెక్క, రెండు యాలకులు, పల్లీలు, జీలకర్ర, జీడిపప్పులు, పచ్చిమిర్చి వేసి నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ప్రెజర్​ కుక్కర్​లో నూనె వేడి చేసి దాల్చిన చెక్క, లవంగం, యాలకులు, సోంఫు, కరివేపాకు వేసి వేగాక ఉల్లిగడ్డ తరుగు, తర్వాత అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత క్యారెట్, ఆలుగడ్డ ముక్కలు, బీన్స్ తరుగు, కాలిఫ్లవర్, బటానీలు వేసి కలపాలి. ఆపై రెడీ చేసుకున్న మిశ్రమంతోపాటు ఉప్పు వేసి, నీళ్లు పోసి బాగా కలపాలి. మూతపెట్టి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. చివరిగా కరివేపాకు, కొత్తిమీర చల్లాలి.