బతుకమ్మ పండుగ.. ప్రకృతి రక్షణే ప్రజల రక్షణ

బతుకమ్మ పండుగ.. ప్రకృతి రక్షణే  ప్రజల రక్షణ

హిందూత్వ సిద్ధాంతానికి మూలపురుషుడైన వినాయక దామోదర్ సావర్కర్ ‘‘బంగరు భూమి కంటే స్వేచ్ఛారణ్యమే మేలు” అంటాడు. కానీ, పాలకుల పుణ్యమాని సమాజానికంతటికి ఆక్సిజన్ అందిస్తున్న అరణ్యాలే ఇప్పుడు ఊపిరి పీల్చుకోలేక తల్లడిల్లుతున్నాయి. మన దేశ మతవిశ్వాసాల్లో ప్రకృతిని పార్వతితో పోలుస్తారు. ఏదైతేనేం ఆ ప్రకృతిని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుందని అందరం విశ్వసిస్తాము. ఆచరణలో లాభాల వేటలో ప్రకృతిని విధ్వంసం చేయడం, అందుకు ప్రకృతి చేస్తున్న ప్రతీకార చర్యలు రోజూ చవిచూస్తుండటం మనకు అలవాటైపోయింది. కనీసం ప్రకృతి,- పంటలు, -మహిళలు అనే మూడు అంశాల కలయికగా వస్తున్న బతుకమ్మ సందర్భంగా ఆ విషయాలు నేమరేసుకుని ముందుకు సాగుదామని ‘బహుజన బతకమ్మ’ ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది. 

గత 15 ఏళ్లుగా “బహుజన బతుకమ్మ ఉత్సవం మాత్రమే కాదు ఉద్యమం కూడా” అంటూ సాగుతూ ఈ ఏడు ‘ప్రకృతి రక్షణే ప్రజల రక్షణ’ అంటూ చాటిచెబుతూ రాష్ట్రమంతా కలియ తిరుగుతుంది. నవధాన్యాలకు ప్రకృతి పూలతో స్వాగతమిస్తూ, పునరుత్పత్తికి ప్రతీకయైన మహిళలు ఆడుతూ పాడుతూ జరిపే ఈ పండుగను అర్ధవంతంగా మార్చుకుందాం. అచ్చమైన పంటల పండుగకు కుల-మత అంతరాలుండవని చాటుతూ, బతుకమ్మను సెక్యులర్ పండుగగా తీర్చిదిద్దుకోవడానికి పౌర సమాజంతో పాటు, ప్రభుత్వాలు ముందుకు రావాలని కోరుతున్నా. 

పంటల పండుగ

మనిషి తన కడుపు నింపే ఆహార పంటలకు కృతజ్ఞత చెప్పడం అనేది ఆదిమ సమాజాల నుంచి ఆధునిక నాగరిక సమాజాల దాకా పంటల పండుగ రూపంలో కొనసాగుతూనే ఉంది. దక్కన్ పీఠభూమిగా పేరుగాంచిన తెలంగాణ గుట్టల్లో, చెలుకల్లో సీతాఫలాలు అంది వచ్చే కాలంతోపాటు, మెట్ట పంటలన్నీ అందివచ్చే కాలం కూడా బతుకమ్మగా మన ముందుకు వస్తుంది. బహుళ పంటలతో తెలంగాణ గ్రామాలను స్వయం పోషకం చేసిన దానికి ప్రతీకగా, తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ రోజుల్లో 9 రకాల సద్దులతో అయినాలు-వాయినాలు అందుకోవడం ప్రతీతి. ఏకంగా చివరి రోజును సద్దుల బతుకమ్మగా పిలుచుకుంటున్నామంటే బతుకమ్మ అచ్చమైన పంటల పండుగ అనడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ మరేదీ లేదు. కేరళ ఓనం పండుగ రోజున తినేదాన్ని కూడా సద్ది అని అంటారు. ఓనం పండుగలో మన మట్టి బొడ్డెమ్మల్లాగా, ఐదు మట్టి ముద్దలను త్రికోణాకారంలో తయారుచేసి వాటిని పూలతో అలంకరిస్తారు. పంటలకు తల్లి అయిన మట్టిని బొడ్డెమ్మగా చేసి ఆడుకోవడం నేను చిన్నతనం నుంచి చూస్తున్నా. తొమ్మిది రోజుల బొడ్డెమ్మ తర్వాతనే ఎంగిలిపూల బతుకమ్మ మొదలవుతుంది. మరి ఓనం పంటల పండుగగా గుర్తించబడితే, బతుకమ్మకు ఆ గుర్తింపు లేదు. వాస్తవానికి నవధాన్యాల సంస్కృతి ఆధారంగా మన పెంటను, పంటను, వంటను సంస్కరించుకోవచ్చు. ఆయా నాగరిక సమాజాల ఉత్పత్తి (మోడ్ ఆఫ్ ప్రొడక్షన్)ని ఆధారం చేసుకునే పంటల పండుగలుంటాయి. 

అమావాస్య రోజున.. 

పంచభూతాలను నమ్మే ఆదిమ జాతి ప్రజలు మరణానంతరం మనుషులు వాటిలోనే విలీనమవుతారని విశ్వసిస్తూ పంటలు చేతికొచ్చే సమయంలో అమావాస్య రోజున పితరులకు ఇష్టమైన వంటకాలు చేసి పెడతారు. దాన్ని మనం పెత్తరమాస (పితరుల అమావాస్య) అంటున్నాం. తమ పితరులను, మట్టిని, పంటలను, ప్రకృతిపూలను, నీళ్లను గౌరవిస్తూ మనిషిని ఒకరినొకరు గౌరవించుకునే సాంప్రదాయాన్ని ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది. ఇది ఒక పార్శ్వం మాత్రమే. ఈ సందర్భంగా భూమికి, వ్యవసాయానికి ప్రత్యక్ష సంబంధమున్న శ్రమజీవుల పట్ల, దళితుల పట్ల అమలవుతున్న సామాజిక వివక్షను రూపుమాపాలని బహుజన బతకమ్మ కోరుకుంటుంది. అందుకే బతుకమ్మకు వెలివాడలే లేవని, అవి తొలివాడలనే పిలుపును అమలుపరుస్తూ సాగుతోంది. ఊరు వాడల్ని ఏకం చేయడం ద్వారా తమ మధ్య అంతరాలు తొలగిపోయి నిజమైన బతుకుదెరువు సమస్యలను ఎజెండాగా మార్చుకుంటేనే సమాజం ముందడుగు వేస్తుంది. ఆర్థిక-, సామాజిక ప్రజాస్వామీకరణ అనేది బతుకమ్మ లాంటి పంటల పండుగను ప్రజాస్వామీకరించడానికి దారులు వేస్తుంది. 

శ్రమజీవుల సంస్కృతి

మనదేశంలో పంటల చుట్టూ ముడి వేసుకున్న పండుగలన్నీ కనుమరుగై హంగు ఆర్భాటాలు, అనుత్పాదక అట్టహాసాలు, అంధ విశ్వాసాల పరివ్యాప్తి పెరుగుతున్న కాలమిది. ఏరువాక పౌర్ణమి, పొలాల అమావాస్య లాంటి పండుగలు అన్ని దున్నకాల కోసం ఎడ్లను సిద్ధం చేయడంతో ముడివడి ఉంటాయి. ఆయేటి పూనే సమయంలో వచ్చే వ్యాధులను నిరోధించడం, ముందస్తు జాగ్రత్తలతో వాటిని సచేతనం చేయడం, వాటిని అలంకరించి ఊరేగించడం ఈ పండుగల ప్రత్యేకత. పునరుత్పత్తిని గౌరవించే ఆదివాసులు ఆడ జంతువులను వేటాడకపోవడం, కోడి పెట్టను కోయకపోవడం, గుడ్లతో దొరికిన చేపలను నీటిలోనే వదలడం లాంటి సంప్రదాయాలతో  తెలంగాణలో ఆడబిడ్డలను గౌరవించడం ఆనవాయితీ. ఇంటి పని, వంట పని, పిల్లల పెంపకం, వ్యవసాయ పనుల్లో తీరిక లేకుండా ఉన్న తెలంగాణ మహిళలు నాట్ల తర్వాత ఒరంపై బతుకమ్మను పేర్చే సౌందర్యాత్మకత సద్దుల బతుకమ్మల్లో ఊరూరును ఒక కార్నివాల్‌‌‌‌గా తలపింపజేస్తుంది. అలాగే పనీ పాటల సంస్కృతిలో వందల, వేల పాటలు స్త్రీల జీవిత అనుభవాలుగా పాడుకోవడం బతుకమ్మ పాటల ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. అందుకే తెలంగాణ సమాజ మార్పు కోసం జరిగిన ప్రతి సంఘర్షణ మూలమలుపులో బతుకమ్మ పోరాట పాటయ్యింది. సహజ సిద్ధమైన కోయిల గొంతులు పంట పొలాలు దాటి, ఊర్లు వాడకట్టులు దాటి నగరం నడిబొడ్డున నగారాలై మోగుతుండటం, భాషా జ్ఞానం తెలియని అంతర్జాతీయ సమాజాన్ని సైతం ఉర్రూతలూగించడం మనం కళ్లారా చూస్తున్నాం.

పాటల సంస్కృతికి అద్దం

ప్రకృతికి, పంట పొలాలకు చేరువగా ఉన్న తెలంగాణ స్త్రీలు పాడుతున్న పాటలన్నీ పని-పాటల సంస్కృతికి అద్దం పడుతున్నవే. అందుకే బతుకమ్మ పాటలైనా, బతుకు చిత్రంతో ముడి వేసుకున్న బహుజన బతకమ్మ పాటలైనా ఉయ్యాల పదంతో పెనవేసుకునే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో రెపరెపలాడుతూ ఎగిరిన బహుజన బతుకమ్మను ఉద్యమ పతాకంగా మలిచింది మొదలు, సహజ వనరుల పరిరక్షణకు, చెరువులు, కుంటలు కాపాడటానికి, అంటరానితనం దూరం చేయడానికి, మద్యపానం అరికట్టడానికి ప్రాధాన్యత నిచ్చాం. ఏక పంటలతో, రసాయన ఎరువులతో పురుగుమందులతో భూసారం దెబ్బతిని, కరువులు కాటకాలు నిండా ముంచుతూ, మార్కెట్లు కొల్లగొడుతున్న వేళలో తెలంగాణ నవధాన్య సంస్కృతికి ప్రాధాన్యత పెరుగుతున్నది. మన వ్యవసాయాన్ని తెర్లు చేస్తున్నదని రసాయన ఎరువులు, పురుగు మందులు లేకుండా మనుగడ సాగించలేని స్థితికి చేరుకున్నం. ఈ స్థితిలో ‘‘ప్రకృతి రక్షణే ప్రజల రక్షణ” అన్న పిలుపుకు భవిష్యత్తు ఉందని నమ్ముతున్నాం. “ఒక్కేసి పువ్వేసి చందమామ’’ అని ఆడుతున్న కోట్లాదిమంది బిడ్డలకు, తెలంగాణ సమాజానికి ‘బహుజన బతుకమ్మ’ తరఫున ఉద్యమాభినందనలు తెలుపుతున్నా. ప్రతి ఊరిలో, వాడలో, పట్నంలో, నగరాల్లో దేశ విదేశాల్లో ఆడుతున్న అక్కాచెల్లెళ్ళు, అన్నదమ్ములంతా ప్రకృతి రక్షణే మన రక్షణ అంటూ పంతం బూని ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నా. 

అరుణోదయ విమలక్క, 
బహుజన బతుకమ్మ, అధ్యక్షురాలు