- మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో ఘటన
జడ్చర్ల, వెలుగు: తండ్రిని వదిలించుకోవడానికి ఓ కొడుకు అతడికి మాయమాటలు చెప్పి ఊరు కాని ఊరు తీసుకొచ్చాడు. ఆయన అరవకుండా నోట్లో గుడ్డలు కుక్కాడు. ఎలా వచ్చామో దారి తెలియొద్దని ఏకంగా కండ్లకు కూడా గంతలు కట్టి మురికి కాల్వ పక్కన వదిలేసి వెళ్లిపోయిన ఘటన మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి.. జిల్లాలోని కోయిల్‌కొండ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన వడ్డె బాలయ్య(70) భార్య మూడేళ్ల కింద చనిపోయింది. అప్పటి నుంచి ఆయన ఒక్కగానొక్క కొడుకు మోహన్ వద్ద ఉంటున్నాడు.
ఈ క్రమంలో మంగళవారం జడ్చర్ల మున్సిపాల్టీలోని వంద పడకల హాస్పిటల్ సమీపంలో ఉన్న మురికి కాల్వ వద్ద బాలయ్య అపస్మారక స్థితిలో కనిపించాడు. ఆయన కండ్లకు గంతలు, నోట్లో గుడ్డలు కుక్కి ఉన్నాయి. దీంతో కావాలనే ఎవరో అతడిని ఇక్కడ వదిలి వెళ్లినట్లు స్పష్టమవుతోంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బాలయ్యను పరిశీలించారు. స్వచ్ఛంద సంస్థ సభ్యులను పిలిపించి నోట్లో గుడ్డలను తీసి, ఆయన కండ్లకు కట్టిన గంతలను తొలగించారు. అనంతరం మోహన్‌కు ఫోన్ చేసి బాలయ్యను అప్పగించారు. కాగా.. తండ్రిని వదిలించుకోవడానికే కొడుకు ఈ పని చేసి ఉంటాడని రాంపూర్ గ్రామస్తులు చెబుతున్నారు. కొడుకు మాత్రం తన తండ్రికి కొంత కాలంగా మతిస్థిమితం సరిగా లేదని, తరచూ ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయేవాడని అంటున్నాడు. ఇదిలాఉంటే ఆయన ఇంట్లో నుంచి వెళ్లిపోతే కండ్లకు ఎవరు గంతలు కట్టారు? నోట్లో ఎవరు గుడ్డలు కుక్కారు? అనేది సస్పెన్స్‌గా మారింది.

