యాదాద్రి తరహాలో తల్లి కోసం గుడి నిర్మాణం

యాదాద్రి తరహాలో తల్లి కోసం గుడి నిర్మాణం

తల్లిదండ్రులకు బుక్కెడు బువ్వ పెట్టని ఈ రోజుల్లో...తల్లిదండ్రులను పట్టించుకోని ఈ కాలంలో...ఓ కొడుకు ఏకంగా తల్లి కోసం ఆలయాన్నే నిర్మిస్తున్నాడు. గుడి అంటే నామమాత్రమైనది కాదు..దేవుడికి ఏ మాత్రం తీసిపోని విధంగా తల్లి ఆలయాన్ని నిర్మిస్తున్నాడు. ప్రత్యేకమైన రాతితో..వాస్తు విశేషాలతో తన తల్లి జ్ఞాపకార్థం శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలానికి చందిన శ్రవణ్ కుమార్..టెంపుల్ను నిర్మిస్తున్నాడు. 

తల్లిని మర్చిపోలేక...


శ్రవణ్ కుమార్ తల్లి అనసూయ దేవి. ఆమె 2008లో చనిపోయారు. ఆమె చనిపోయినా..తల్లిని మర్చిపోలేకపోయాడు. అందుకే శ్రవణ్ కుమార్ అమ్మ కోసం ఆలయాన్ని నిర్మించాలనుకున్నాడు.  సొంతూరు శ్రీకాకుళం జిల్లాలోని  చీమల వలసలో 2019 లో ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.  

ఆరడుగుల ఎత్తులో విగ్రహం..
నేను నా తల్లిని ప్రేమించాను.. కొన్ని సంవత్సరాల క్రితం ఆమెను కోల్పోయాను. నా తల్లిని మర్చిపోలేక...ఆమెకు ఒక దేవాలయాన్ని నిర్మించాలని అనుకున్నా...ఇందు కోసం బీహార్ నుండి కూలీలను రప్పించాను. 2019లో ఆలయ పని ప్రారంభమైంది. ఆలయంలో ప్రతిష్టిం చేందుకు ఆరు అడుగుల ఎత్తున్న ఒకే రాతి శిల్పంతో  నా తల్లి విగ్రహాన్ని తయారు చేయించాను...అని కొడుకు శ్రావణ్ కుమార్ తెలిపాడు. 

యాదాద్రి ఆలయ స్పూర్తితో...
తల్లికి గుడిని నిర్మించాలనుకున్న శ్రవణ్ కుమార్..తెలంగాణలోని యాదాద్రి పునర్నిర్మాణ పనులను పరిశీలించాడు. రాతి నిర్మాణ విశేషాలను తెలుసుకున్నాడు. యాదాద్రి వంటి రాతితోనే తన తల్లికి అద్భుతంగా గుడి కట్టాలని నిర్ణయం తీసుకున్నాడు. అనుకున్నట్లే రాతితో, వాస్తు విశేషాలతో తల్లి అనసూయదేవి కోసం ఆలయాన్ని నిర్మిస్తున్నాడు.

రాతి బంధన విధానంలో నిర్మాణం
ఆలయం నిర్మాణంలో శ్రవణ్ కుమార్...గరుడు సున్నం, కరక్కాయ, బెల్లం, కొబ్బరి పీచు, తుమ్మ బంక, ఇసుక యంత్రాలను ఉపయోగిస్తున్నాడు. వీటిని మిశ్రమం చేసి నెలరోజులపాటు పులియబెట్టి  మిశ్రమాన్ని నిర్మాణంలో వాడుతున్నాడు. ఎక్కడా కూడా సిమెంటును వాడటం లేదు. కేవలం  రాతి బంధన విధానంలోనే అమ్మ దేవస్థానాన్ని కడుతున్నాడు. ఆలయ నిర్మాణం కోసం తమిళనాడు, ఒరిస్సాల  నుండి శిల్పులను తీసుకువచ్చాడు. ఏక కృష్ణ శిలలపై శిల్పాలను చెక్కించాడు.