తల్లికి కరెంట్​ షాక్..  కాపాడబోయి కొడుకు మృతి

తల్లికి కరెంట్​ షాక్..  కాపాడబోయి కొడుకు మృతి

ములుగు, వెంకటాపూర్‌ (రామప్ప), వెలుగు: కరెంట్  షాక్  తగిలిన తల్లిని కాపాడబోయి కొడుకు చనిపోయాడు. ములుగు మండలం పత్తిపల్లి గ్రామంలో శనివారం ఈ ప్రమాదం జరిగింది. గ్రామస్తులు తెలిపిన  వివరాల ప్రకారం.. పోరిక రజిత ఉదయం 6 గంటలకు తమ ఇంటి వద్ద ఉన్న జె వైర్ పై బట్టలు ఆరబెడుతోంది. ఇంట్లోకి విద్యుత్ సరఫరా అయ్యే వైరు జె  వైరుకు తగిలి ఉండటంతో ఒక్కసారిగా ఆమె షాక్ కు గురై కేకలు వేసింది.

ఇంట్లో పడుకొని ఉన్న ఆమె కొడుకు సురేశ్ (22) హుటాహుటిన తల్లి వద్దకు వెళ్లి ఆమెను   కాపాడాలని పట్టుకొని లాగాడు. దీంతో సురేశ్  సైతం కరెంట్  షాక్​కు గురై అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వెంటనే ఇద్దరినీ ములుగు ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో సురేశ్  చనిపోయాడు. అతని తల్లి స్వల్ప గాయాలతో బయటపడింది.