పక్కా ప్లాన్‌‌‌‌తో తండ్రిని చంపిన కొడుకు

పక్కా ప్లాన్‌‌‌‌తో తండ్రిని చంపిన కొడుకు

జులాయి తిరుగుతున్న కుమారుడిని మందలించిన ఓ తండ్రికి కొడుకే కాలయముడయ్యాడు. ఇన్సూరెన్స్, రైతు బందు ఇన్సూరెన్స్ డబ్బుకోసం, ఇటీవల కొన్న ట్రాక్టర్ లోన్ మాఫీ అవుతుందని త౦డ్రినే విద్యుత్ షాక్ తో చంపాడు ఓ కసాయి కుమారుడు. ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తో చనిపోయాడని సీన్ క్రియేట్ చేశాడు. కానీ పోలీసుల విచారణలో మాత్రం దొరికిపోయాడు. మానవత్వం లేని కసాయి కొడుకును జైల్ కు తరలించారు పోలీసులు.

మెడక్ జిల్లా నిజాంపేట్ మండలం తిప్పన్నగుల్ల గ్రామానికి చెందిన గుర్రాల చంద్రం(50) గత శుక్రవారం తన వ్యవసాయ బోరుబావి వద్ద విద్యుత్ షాక్ తో చనిపోయాడు. చంద్రం మరణం పై పలు అనుమానాలు రావడంతో నిజాంపేట్ పోలీసులు తమదైన శైలీలో విచారణ చేపట్టగా కన్న కొడుకే హాంతకుడని తేల్చారు. ఒకరోజు తండ్రి చంద్రం.. కుమారుడు దయాకర్(21) ను జులాయి గా తిరుగ వద్దని మందలించాడు. దీంతో దయాకర్ కు ఒక దుర్బుద్ధి వచ్చింది… తండ్రిని చంపితే రైతు బందు ఇన్సూరెన్స్ డబ్బు 5,00,000 కోసం, ఇటీవల కొన్న ట్రాక్టర్ లోన్ 5,00,000 మాఫీ అవుతుందని మరియు TRS సభ్యత్వం 2,00,000 మొత్తం రూ. 12,00,000 వస్తుందని త౦డ్రినే విద్యుత్ షాక్ తో చంపాడు దయాకర్.

పక్క గ్రామంలోని కిరాణా దుకాణంలో ఇనుప బైండింగ్ వైర్ కొన్న దయాకర్ పొలంలోని బోరు మోటారు వద్ద కరెంట్ షాక్ వచ్చేలా చేసి తండ్రి హత్యకు స్కెచ్ వేశాడు. ఇదేమి తెలియని చంద్రం 16.08.19 నాడు పొలం వెళ్ళి కరెంట్ షాక్ తో చని పోయాడు. ఏమి తెలియనట్లు కుమారుడు దయాకర్ ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ కొట్టి చనిపోయాడని సీన్ క్రియేట్ చేశాడు. కానీ పోలీసుల విచారణలో మాత్రం దొరికిపోయాడు. డబ్బు కోసం తండ్రినే చంపినట్లు పోలీసులకు విచారణలో చెప్పాడు. నిజంపేట్ SI ఆంజనేయులు 5 రోజుల్లోనే కేసును ఛేదించి కసాయి కొడుకు దయాకర్ ను కటకటాలలోకి పంపించారు.