సినిమా ఆడాలంటే పాట ఉండాలా?

సినిమా ఆడాలంటే పాట ఉండాలా?

సినిమా మొదలయ్యింది. హీరో ఎంటరయ్యాడు. వెంటనే పాట. హీరోయిన్ ని చూశాడు. ప్రేమలో పడ్డాడు. ఊహల్లో పాట. హీరోయిన్ ఎస్ చెప్పింది. జంటగా పాట. అనుకోకుండా బ్రేకప్ అయ్యింది. బాధలో పాట. ప్రతి భావానికీ, ప్రతి సందర్భానికీ ఒక పాట. పాటకు అంత ప్రాధాన్యమా? సినిమాకి పాట అంత అవసరమా? ఎవ్రీ నైట్ ఇన్ మై డ్రీమ్స్.. ఐ సీయూ… ఐ ఫీల్ యూ… ‘టైటానిక్’ సినిమా అయిపోయాక వచ్చే ఈ పాటప్రపంచం మొత్తాన్నీ ఊపేసింది. కానీ ఆ సినిమా మధ్యలో ఎక్కడా పాటలు లేవు. ఆ సినిమాలోనే కాదు… ఏ హాలీవుడ్ సినిమాలోనూ పాటలుండవు. ఎందుకని? ఆ మధ్య వచ్చిన ‘అరవింద సమేత’లో నాలుగు పాటలు మాత్రమే ఉంటాయని దర్శక నిర్మాతలు ముందే ప్రకటించారు. ఎన్టీయార్ సినిమాలో కేవలం నాలుగు పాటలేనా? పైగా అందులో రెండు సిట్యుయేషనల్ సాంగ్సే. ఏంటిది అంటూ అభిమానులు అవాక్కయిపోయారు.

ఎందుకు?

భారతీయ సినిమాలో పాట అనేది ప్రముఖ భాగం. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం… ఏ భాష సినిమాలోనైనా పాట ప్రధానం. ఇది మన దేశంలో సినిమా పుట్టిన నాటి నుండీ కొనసాగుతున్నసంప్రదాయం. తొలి భారతీయ చలనచిత్రం ‘ఆలం అరా’. ఈ సినిమా కోసం వజీర్ మహ్మద్ ఖాన్పాడిన ‘దేదే ఖుదా కే నామ్ ’ అన్న పాటే తొలి భారతీయ సినిమా పాట. నాటి నుంచే పాట అన్నది సినిమాతో పెనవేసుకుపోయింది.

పాట కథలు
పాత సినిమాల్లో పాటల్ని గమనిస్తే… ప్రతిపాటనీ హీరో హీరోయిన్లు , లేదా ఆ పాటలోనటించే ఆర్టిస్టులే పాడుతున్నట్టుగా ఉండేవి. కానీ ఇప్పుడు స్టైల్ మారింది. కథ నడుస్తుంటే పాట బ్యాగ్రౌండ్ లో రావడం నేటి ఒరవడి. పాట అనగానే హైదరాబాద్ లో ఉన్న హీరోహీరోయిన్లు సడెన్ గా ఇటలీలో ప్రత్యక్షమయ్యి స్టెప్పులేయడం పాత పద్ధతి. వాళ్లిద్దరూ సమయం ఎలా గడుపుతున్నారు, ఒకరికొకరుఎంత దగ్గరగా ఉన్నారు అనే విషయాలను తెలుపుతూ చిన్న చిన్న సన్నివేశాలతో పాటల్ని రూపొందించడం ఇప్పటి పద్ధతి. ఈ పాటలు వినడానికి ఎలా ఉన్నా సరే… చూడటానికి మాత్రం ప్రేక్షకులు ఇష్టపడతారు. ఎందుకంటే పాటలో కథ నడిచిపోతూ ఉంటుంది. పాట మిస్సయితే కథ మిస్సయినట్టే. కాబట్టి కచ్చితంగా పాట చూస్తారు. ఇలాంటి పాటల వల్ల దర్శకుడికీ ఓ సౌలభ్యం ఉంది. కొంత కథని పాటలో చూపించేయడం వల్ల నిడివి కలిసొస్తుంది.

జంట జావళి
నాయకా నాయికలు ఒకరినొకరు చూసుకోగానే ఊహల్లో తేలిపోతారు. ఆ ఊహలకి ఊతం పాట. ఆ తర్వాత వాళ్లు కలుసుకున్నప్పుడు, కబుర్లాడుకున్నప్పుడు, రొమాన్స్ చేసినప్పుడు… ప్రతి సందర్భంలోనూ పాటే.భాగ్యలక్ష్మిని చూడగానే ‘ఆకాశం అమ్మాయైతే నీలా ఉంటుంది’ అంటూ ‘గబ్బర్ సింగ్’ సాంగేసుకున్నాడు. జానకితో ప్రేమలో పడగానే‘ బంతిపూల జానకీ’ అంటూ ‘బాద్ షా ’ పాటందుకున్నాడు. నచ్చిన చెలి చెంతచేరగానే ‘బాహుబలి’ అంతటోడు సైతం ‘హంస నావలో’ హాయిగా సాగిపోయాడు. ‘చేతిలో చెయ్యేసి చెప్పు బావా’ అంటూ ఒకప్పుడు బాసలు చేసుకుంటే… ‘నా నాటు కోడివే క్యూట్ జోడివే టేక్ మీ’ అంటూ ఇప్పుడు మాస్ గా మనసులు ముడి వేసుకుంటున్నారు. తీరు మారినా ప్రతిసిట్యుయేషన్ కీ పాట మాత్రం తయార్. అందుకే డ్యూయెట్‌ లేని సినిమా ఊహకు కూడా అందదు మనకి.

అన్న అడుగేస్తే సాంగ్
ఒకప్పుడు హీరోలకు ఎంట్రీ సాంగ్స్ ఉండేవి కాదు. హీరోలను స్టార్స్ అని పిలుచుకోవడం మొదలైనప్పటి నుంచి ఈ సంప్రదాయం మొదలయ్యింది. తెరపై హీరో ప్రత్యక్షమవగానే అతడి గుణగణాలను, సాహసాలను వర్ణిస్తూ ఓ పాట మొదలవుతుంది. చివరికి పరిస్థితి ఎలా తయారయ్యిందంటే… చిన్నా లేదు, పెద్దా లేదు… ఏ హీరోఅయినా ఇంట్రడక్షన్ సాంగ్ తప్పనిసరి అయిపోయింది. దీనివల్ల మంచి కంటే చెడే ఎక్కువ అన్నది ఎక్కువమంది అభిప్రాయం.ఎందుకంటే సినిమా మొదలయ్యాక హీరో తొందరగానే ఎంట్రీ ఇచ్చేస్తాడు. దాంతో త్వరగా కథలోకి వెళ్లిపోవాలన్న తొందరలో ప్రేక్షకుడు ఉంటాడు. అలాంటి స్థితిలో కథకి సంబంధం లేని లొకేషన్లో , ఓ ఇరవై ముప్ఫైమంది డ్యాన్సర్లను వెనకేసుకుని హీరో డ్యాన్స్ చేస్తూ ఉంటే చూడటం కాస్త కష్టమే. ఒకవేళ కథకి ఆ పాట లింక్ అయ్యి ఉంటేఓకే. కానీ కావాలని ఇరికించిన పాటలతోనే ఇబ్బంది. ఆ ఇబ్బంది ఇటీవలికాలంలో తరచూ ఎదురవుతోంది తెలుగు ప్రేక్షకుడికి.

నిజానికి పాటల ద్వారా జరిగే బిజినెస్ కూడా చిన్నదేమీ కాదు. సీడీలు, డీవీడీలు, మ్యూజిక్ రైట్స్, రాయల్టీలంటూ బోలెడు వ్యవహారాలున్నాయి . దానికి తోడు ఇప్పుడు యూట్యూబ్ వ్యూస్ వంటివి కూడా యాడ్ అయ్యాయి. అందుకే పాటలు కంపల్సరీ అయిపోతున్నాయి . కానీ హాలీవుడ్ వారు మాత్రం ఇప్పటికీ తమకి పాటలు అవసరం లేదనే అంటున్నారు. సంగీతాన్ని ప్రేమించే వారికోసం మ్యూజిక్ ఆల్బమ్స్ వస్తున్నాయిగా అంటున్నారు హాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్. ప్రేక్షకుడిని ఎక్కువసేపు కూర్చోబెట్టి విసిగించకుండా, చూపించాల్సింది చూపించి పంపేస్తే చాలన్నది వారి అభిప్రాయం. కథ, కథనాలు బలంగా ఉంటే ప్రేక్షకుడు లీనమై సినిమా చూస్తాడు, మధ్యలో మరో ఆటవిడుపు కోరుకోడు అని వారి నమ్మకం. అది కరెక్టని నేటికీ వాళ్లు ప్రూవ్ చేస్తున్నారు. పాటలతో పనిలేకుండా ఎన్నో అద్భుతమైన సినిమాలు తీసి ఆకట్టుకుంటున్నారు.

ఇవే కాదు… ఇంకా టీజింగ్ సాంగ్స్, ఐటమ్ సాంగ్స్, ఇన్ స్పిరేషనల్ సాంగ్స్ అంటూ చాలా సృష్టించుకున్నాం. కానీ ఒక ప్రశ్నకి జవాబు మాత్రం చెప్పలేకపోతున్నాం. సినిమాకి పాటలు అవసరమా? పాట మనసుకి హాయినిస్తుందని ఒప్పుకుంటాం. కానీ పాటలేని సినిమాని చూడటం కష్టమని ఒప్పుకోలేం. ఎందుకంటే కథలో మిళితమై పోయి, కథతో సాగిపోయే పాటలతో మనకి ఎలాంటి ఇబ్బందీ లేదు. కానీ అవసరం లేకపోయినా హీరోలకి హైప్ ఇవ్వడానికి, హీరోయిన్ల గ్లామర్ చూపించడానికి, మసాలా జోడించి అట్రాక్ట్ చేయొచ్చన్నఅపోహలతోటి రూపొందించే పాటలు మనకి అక్కర్లేదు. కథాకథనాలు బాలేకుండా పాటలు బాగున్నంత మాత్రాన మనం మూవీని సక్సెస్ చేయం. పాటలు అద్భుతంగా ఉన్నాసినిమాలు పోయిన సందర్భాలు ఎన్ని లేవు! పాటలు అంతంత మాత్రంగా ఉన్నా సినిమా హిట్టవడంఎన్ని సార్లు చూడలేదు! చోకర్ బాలి,పథేర్ పాం చాలి, ఎ వెడ్నస్ డే,లంచ్ బాక్స్, కహానీ, ఘాజీ, అ,యూటర్న్, విచారణ వంటి సినిమాల్లో ఒక్క పాట కూడాలేకున్నా వాటికి మంచి సినిమాలంటూ ఎంతమందిముద్ర వేయలేదు!అంటే సినిమాలోపాట పెట్టడమన్నది మనకున్నఅలవాటు. అవసరం కాదు.అంతే!

కొన్నిసార్లు పాటలకి అట్రాక్ట్ అయ్యి సినిమాకెళ్తాడు ప్రేక్షకుడు. తీరా వెళ్లాక ఉసూరుమంటాడు. ‘2.ఒ’ లో కొన్ని కోట్లు ఖర్చు పెట్టిపాట తీశారు. కానీ దాన్ని పెట్టడానికి తగిన సిట్యుయేషన్ సినిమాలో లేక చివర్లో పెట్టారు. లేచి వెళ్లిపోయే సమయంలోఎవరు ఆసక్తిగా చూస్తారు ఆ పాటని. అంటే అంత డబ్బూ వృథాయేకదా! ‘అత్తారింటికి దారేది’ చిత్రంలో హీరో ఎంట్రీ కోసం ‘ఆరడుగుల బుల్లెట్టు’ అంటూ ఓ పాట పెట్టారు. భైరవుడో భార్గవుడో రక్కసుడో.. అంటూసాగే ఆ పాట వింటే హీరోని ఓ యోధుడిలా ఊహించుకుంటాడు ప్రేక్షకుడు. కానీ అతడు వెళ్లేది తన అత్తని కన్విన్స్ చేసి తెచ్చుకోవడానికి. సెంటి మెంటును కురిపించాల్సిన ఆ సమయంలో అంత భారీ పదాలతో పాట అవసరమా అని ఫీలైనవారూ లేకపోలేదు. ఇలా అనవసరమైనవి, అతకనివి పెట్టడం కంటే పాటలులేకపోవడమే బెటర్ అని ప్రేక్షకులు ఫీలవడంలోతప్పు లేదు కదా!

.