పాటల రచయిత, సీనియర్ జర్నలిస్టు పెద్దాడ మూర్తి కన్నుమూత

పాటల రచయిత, సీనియర్ జర్నలిస్టు పెద్దాడ మూర్తి కన్నుమూత

ప్రముఖ పాటల రచయిత, సీనియర్‌ ఫిల్మ్ జర్నలిస్ట్ పెద్దాడ మూర్తి కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన... ఈ రోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. జర్నలిస్ట్ గా కెరీర్ గా ప్రారంభించిన పెద్దాడ మూర్తి.. టాలీవుడ్ లో పలు సినిమాలకు పాటలు కూడా రాశారు. వేటూరి స్ఫూర్తితో రైటర్ కావాలని మూర్తి హైదరాబాద్ వచ్చారు. ఆ తర్వాత ఓ తెలుగు దినపత్రికలో కొన్నాళ్ల పాటు సినీ జర్నలిస్ట్ గా పని చేశారు. 

జర్నలిస్టుగా పనిచేస్తూనే మూర్తి సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. 'కూతురు' సినిమాతో సినీ పరిశ్రమకు పరిచయమైన మూర్తి.. రవితేజ నటించిన ఇడియట్, అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి, చిరంజీవి నటించిన స్టాలిన్, చందమామ తదితర సినిమాలకు పాటలు అందించారు. `చందమామ` మూవీలోని లోని పాటలకు మంచి గుర్తింపు దక్కింది. `అమ్మానాన్న ఓ తమిళమ్మాయి`లో `నీవే నీవే..`, `ఇడియట్` లో `చెలియా చెలియా.. ` తదితర పాటలు మూర్తికి మరింత గుర్తింపు తెచ్చిపెట్టాయి. వీటితో పాటు `ఇష్ట సఖి`, `హౌస్ ఫుల్` అనే ప్రైవేట్‌ ఆల్బమ్స్ కూడా చేశారు. 

పెద్దాడ మూర్తి పలు టీవీ సీరియల్స్ కు కూడా పాటలు రాశారు. ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉన్న భరత్ మూవీ ‘నాగలి’కి ఆయన మాటలు, పాటలు అందించారు. మూర్తి రాసిన `తారా మణిహారం` అనే పుస్తకాన్ని చిరంజీవి చేతుల మీదుగా ఆవిష్కరించారు. పెద్దాడ మూర్తి మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నారు.