క్యాన్సర్​ను జయించినా.. రేడియేషన్‍ ఎఫెక్ట్ వదల్లే

V6 Velugu Posted on Oct 25, 2021

  • పాటల రచయితకు మరో ఆపరేషన్‍ కంపల్సరీ
  • రేపే మాదాపూర్‍ హాస్పిటల్​లో వెన్నెముక సర్జరీ
  • ఆపరేషన్‍ ఖర్చులకు రూ.15 లక్షలు అవసరం
  • దాతలు ఆదుకోవాలని యాదగిరి ఫ్యామిలీ రెక్వెస్ట్ 

వరంగల్‍, వెలుగు: ‘మళ్లి కూయవే గువ్వ.. మోగిన అందెల మువ్వ’.. ‘మనసా నువ్వెండే చోటే చెప్పమ్మా’..  ‘గలగల పారుతున్న గోదారిలా’.. ‘చూపులతో గుచ్చిగుచ్చి చంపకే మేరే హాయ్‍’.. సినిమాల్లో ఇలాంటి ఎన్నో హిట్‍ సాంగ్స్.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయం, యాస, భాషను ప్రపంచానికి మరింత దగ్గర చేసే ప్రయత్నంలో ‘చిన్నీ మా బతుకమ్మా.. చిన్నారక్కా బతుకమ్మా.. దాదీ మా బతుకమ్మా దామెర మొగ్గల బతుకమ్మా’ వంటి వందలాది పాటలను అందించిన ప్రముఖ సినీ గేయ రచయిత డాక్టర్‍ కందికొండ యాదగిరికి ఆరోగ్యపరంగా కష్టాల మీద కష్టలొచ్చిపడుతున్నాయి. ఆయన రెండేళ్లుగా క్యాన్సర్‍తో పోరాడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. పైపు ద్వారా ఫ్లూయిడ్స్ తీసుకుంటున్నారు. కొన్నిరోజులుగా కాళ్లు చేతులు తిమ్మిర్లు ఎక్కుతుండటంతో డాక్టర్లు టెస్టులు చేసి కందికొండకు వెంటనే మరో ఆపరేషన్‍ చేయాలని.. లక్షల్లో ఖర్చవుతుందని తేల్చి చెప్పారు. దీంతో ఆ కుటుంబం మరోసారి చేయూత కోసం ఎదురుచూస్తోంది.

ట్రీట్‍మెంట్‍ టైంలో వెన్నెముకపై ఎఫెక్ట్

వరంగల్‍ జిల్లా నర్సంపేట నాగుర్లపల్లికి చెందిన కందికొండ 25 ఏండ్లుగా సినీ రచయితగా దాదాపు 1,300 పాటలు రాశారు. రెండేళ్ల క్రితం క్యాన్సర్‍ బారిన పడి హాస్పిటల్​లో చేరారు. రచయితగా ఇండస్ట్రీలో గొప్ప పేరు సంపాదించుకున్నారు తప్పితే ఆర్థికంగా ఎదగలేదు. క్యాన్సర్‍ బారినపడ్డాక ట్రీట్‍మెంట్‍ కోసం రూ. 26 లక్షలు ఖర్చు అవగా.. ఉన్న కొద్దిపాటి ఆస్తులకుతోడు రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షలు ఇచ్చింది. తోటి గేయ రచయితలు, ఇతర దాతల సహకారంతో మొత్తంగా ఆయనకు ప్రాణాపాయం తప్పి ఇంటికొచ్చారు. అయితే చికిత్స టైంలో కీమోథెరపీ రేడియేషన్‍ వల్ల  స్పైనల్‍ కార్డ్ లోని సీ1, సీ2 దెబ్బతిన్నాయి. అది కాస్త పెరాలసిస్‍కు కారణమైంది. శరీరంతో పాటు మనిషి మాటలో తేడా వచ్చింది. బతకాలంటే సర్జరీ కంపల్సరీ అయింది.

అందరి చేయూత అవసరం

కందికొండ ఆరోగ్యంగా ఉండాలన్నా.. గతంలో మాదిరి తన కలానికి పని చెప్పాలన్నా ప్రస్తుతం ఆపరేషన్‍ కంపల్సరీ. అది జరగాలంటే మొదట దాదాపు రూ.15 లక్షలు కావాలి. ఈ నెల 26న హైదరాబాద్‍ మాదాపూర్‍లోని మెడికవర్‍ హాస్పిటల్​లో డాక్టర్‍ సూర్యప్రకాశ్‍ ఆధ్వర్యంలోని టీం సర్జరీ చేయనున్నారు. అనంతరం ఐసీయూలో ఉంచేందుకు డైలీ రూ.50 వేల వరకు అవసరం. ఆ తర్వాత ఇంటివద్ద మరో రెండు నెలల చికిత్స అందించాలి. కాగా, ఆర్థికంగా యాదగిరి ఫ్యామిలీ పరిస్థితి బాగోలేదు. దీంతో ఆయన కుటుంబసభ్యులు మళ్లీ సాయం కోరుతున్నారు. గతంలో సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖ పాటల రచయితలు, మ్యూజిక్‍ డైరెక్టర్లు సిరివెన్నెల సీతారామశాస్త్రి, సుద్దాల అశోక్‍తేజ, చంద్రబోస్‍, బోలే షావలీ, రవివర్మ, భాస్కరభట్ల వంటివారు చేయూతనందించారు. సినీ ఇండస్ట్రీ, ప్రభుత్వ పెద్దలతో పాటు దాతలు కందికొండను కాపాడుకునేందుకు మరోమారు స్పందించాలని వారంతా కోరుతున్నారు.

కందికొండ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్
కందికొండ రమాదేవి
యూనియన్ బ్యాంక్
(రాజీవ్ నగర్, హైదరాబాద్)
అకౌంట్ నంబర్:
135510100174728
ఐఎఫ్ఎస్సీ:
UBIN0813559
గూగుల్ పే/ ఫోన్ పే:
8179310687

Tagged Warangal, Hyderabad, donations, surgery, request, song writer Kandikonda

Latest Videos

Subscribe Now

More News