- అంత గౌరవమే ఉంటే.. నెహ్రూ ఇంటిపేరు పెట్టుకోలేదేం?: బీజేపీ
న్యూఢిల్లీ: దేశ మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ గురించి కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటలయుద్ధం సాగుతోంది. నెహ్రూ ఇమేజ్ ను దిగజార్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ ఆరోపించగా.. అంత గౌరవమే ఉంటే నెహ్రూ వారసులు ఇప్పుడు ఆయన ఇంటి పేరును ఎందుకు పెట్టుకోవట్లేదంటూ బీజేపీ కౌంటర్ ఇచ్చింది.
శుక్రవారం ఢిల్లీలోని జవహర్ భవన్ వద్ద నెహ్రూ సెంటర్ ఇండియా ప్రారంభోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్మన్ సోనియా గాంధీ మాట్లాడుతూ.. నెహ్రూ పేరును చరిత్ర పుటల్లో నుంచి చెరిపేయాలని కేంద్రంలోని బీజేపీ సర్కారు ప్రయత్నిస్తోందని ఫైర్ అయ్యారు. ‘‘నెహ్రూ ప్రతిష్టను క్రమంగా మసకబారేలా చేసి, ఆయన పేరును చరిత్రలో నుంచి చెరిపేయాలని ఒక క్రమపద్ధతిలో ప్రయత్నం జరుగుతోంది.
దేశ స్వాతంత్ర్య పోరాటంలో ఆయన పాత్రను, దేశానికి దశాబ్దాల తరబడి వహించిన సమర్థ నాయకత్వాన్ని, ఆయన అందించిన బహుముఖ వారసత్వాన్ని కనుమరుగు చేయాలని చూస్తున్నారు. దేశ చరిత్రనే వారు తిరగరాయాలని అనుకుంటున్నారు” అని ఆరోపించారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా.. గాంధీ, నెహ్రూలు దేశంలోని కోట్లాది మందికి ఎప్పటికీ మార్గదర్శకులుగానే నిలుస్తారన్నారు.
కాగా, సోనియా గాంధీ కామెంట్లపై బీజేపీ అధికార ప్రతినిధి టామ్ వడక్కన్ శనివారం మీడియా ముందు స్పందించారు. నెహ్రూ పట్ల అంత గౌరవమే ఉంటే.. ఆయన ఇంటి పేరును తన కుటుంబసభ్యులకు సోనియా ఎందుకు పెట్టుకోలేదంటూ కౌంటర్ ఇచ్చారు. నిజానికి నెహ్రూ సేవలను తక్కువ చేసింది కాంగ్రెస్ పార్టీయేనన్నారు.
నెహ్రూ చేసిన తప్పిదాలను తెలియజేయడం తప్ప.. ఆయనను అగౌరవపర్చాలన్న ఉద్దేశం తమకు లేదన్నారు. ‘‘పొరపాట్లు చేయడం మానవ సహజం. అనేక స్కాంల నుంచి 1962లో చైనాతో యుద్ధం వరకూ నెహ్రూ చేసిన తప్పిదాలను కాంగ్రెస్ నేతలు కవరప్ చేయాలని చూస్తున్నారు. కానీ ఈ వాస్తవాలన్నీ పబ్లిక్ డొమెయిన్లో ఉన్నప్పుడు, వీటితో కేంద్ర ప్రభుత్వానికి సంబంధం ఎలా ఉంటుంది?” అని ఆయన ప్రశ్నించారు.
