ఈడీని మూడువారాలు గడువు కోరిన సోనియా

ఈడీని మూడువారాలు గడువు కోరిన సోనియా

‘నేషనల్ హెరాల్డ్’ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట హాజరయ్యేందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ మూడువారాలు గడువు అడిగినట్లు తెలుస్తోంది. తమ ఎదుట హాజరుకావాలంటూ  ఈడీ నోటీసులు జారీచేసిన మరుసటి రోజే (జూన్ 2న)  సోనియాగాంధీకి కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది.ఇంకా ఆమెకు కొవిడ్ ‘నెగెటివ్’ రానందున నేడు( జూన్ 8న) ఈడీ ఎదుట  హాజరుకాలేదని తెలుస్తోంది. కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకోవాల్సి ఉన్నందున మరో మూడు వారాలు గడువు కావాలని ఈడీని సోనియాగాంధీ కోరినట్లు సమాచారం.మరోవైపు ఇదే కేసులో రాహుల్  గాంధీ జూన్ 13న ఈడీ ఎదుట హాజరుకావాల్సి ఉంది. అయితే తాను విదేశాల్లో ఉన్నందున ఆ సమయానికి విచారణకు హాజరుకాలేనని ఈడీకి రాహుల్ సమాచారం అందించినట్లు వార్తలు వస్తున్నాయి.   

ఏంటీ ఈ నేషనల్ హెరాల్డ్ కేసు?

1938లో కాంగ్రెస్ లోని కొంతమందితో కలిసి జవహర్ లాల్ నెహ్రూ నేషనల్ హెరాల్డ్ న్యూస్ పేపర్ ను ప్రారంభించారు. దీనిని అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ అనే సంస్థ పబ్లిష్ చేసేది. కాలక్రమేణా ఈ పేపర్ కాంగ్రెస్ పత్రికగా ముద్ర వేసుకుంది. స్వాతంత్య్రం తర్వాత కాంగ్రెస్ అధికార న్యూస్ పేపర్ గా చలామణి అయింది. అయితే తీవ్ర నష్టాల కారణంగా 2008లో ఈ పేపర్ ను మూసివేశారు. పబ్లిక్ సంస్థ అయిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్(ఏజేఎల్)ను యంగ్ ఇండియా లిమిటెడ్ (వైఈఎల్) అనే ప్రైవేట్ సంస్థకు అప్పనంగా కట్టబెట్టారని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి గతంలో ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి సోనియా, రాహుల్‌ సహా ఏడుగురిపై ఢిల్లీలోని అడిషనల్‌ చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో స్వామి కేసు దాఖలు చేశారు. ఏజేఎల్ కు చెందిన నేషనల్ హెరాల్డ్ పత్రికను కూడా వైఈఎల్ సొంతం చేసుకుందని... ఈ క్రమంలోనే దాదాపు రూ.2వేల కోట్ల విలువైన ఏజేఎల్ ఆస్తులను రాహుల్ గాంధీ డైరెక్టర్ గా ఉన్న వైఈఎల్ సంస్థ అక్రమంగా పొందిందని పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు నేషనల్‌ హెరాల్డ్‌ పత్రిక బకాయి ఉన్న రూ.90.25 కోట్లను వసూలు చేసుకునే హక్కును పొందేందుకు యంగ్‌ ఇండియన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ద్వారా నేరపూరితమైన కుట్రపన్నారని సుబ్రహ్మణ్యస్వామి తన ఫిర్యాదులో ఆరోపించారు. కేవలం రూ.50 లక్షల చెల్లించి ఆ హక్కును పొందేందుకు ప్రయత్నించారని అన్నారు. ఈ కేసు విషయమై 2014లో ఈడీ విచారణ చేపట్టింది.