పాలస్తీనా విషయంలో మానవత్వం లేదా..? ప్రధాని మోడీ తీరుపై సోనియా గాంధీ ఫైర్

పాలస్తీనా విషయంలో మానవత్వం లేదా..? ప్రధాని మోడీ తీరుపై సోనియా గాంధీ ఫైర్

న్యూఢిల్లీ: పాలస్తీనా సమస్య పరిష్కారానికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్  సోనియా గాంధీ సూచించారు. పాలస్తీనా విషయంలో కేంద్ర ప్రభుత్వానికి మానవత్వం లేనట్లుందని, ఇజ్రాయెల్ ప్రధాని  నెతన్యాహుతో స్నేహానికే మోదీ ప్రాధాన్యం ఇస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు ‘ద హిందూ’ పత్రికలో ఆమె వరుసగా మూడోసారి పాలస్తీనా అంశంపై వ్యాసం రాశారు. దేశ రాజ్యాంగ విలువలు, వ్యూహాత్మక ప్రయోజనాల కన్నా నెతన్యాహుతో స్నేహానికే మోదీ  ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు. 

ఒక వ్యక్తికి ప్రాధాన్యం ఇచ్చే దౌత్యం మంచిది కాదన్నారు. ‘‘యూకే, కెనడా, పోర్చుగల్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ ఇప్పటికే పాలస్తీనాను దేశంగా గుర్తించాయి.  దశాబ్దాలుగా బాధలు ఎదుర్కొంటున్న పాలస్తీనా ప్రజల సమస్యకు ఒక పరిష్కారం కనుగొనేందుకు ఆ దేశాలు ప్రయత్నిస్తున్నాయి. పాలస్తీనాకు దేశ హోదా ఇవ్వాలని ఐక్యరాజ్య సమితిలోని 193 దేశాల్లో 150 కన్నా ఎక్కువ సభ్య దేశాలు కోరుతున్నాయి” అని సోనియా పేర్కొన్నారు.

ఇండియా కూడా గుర్తించింది..

ఇండియా కూడా 1988 నవంబరు 18న పాలస్తీనాను దేశంగా గుర్తించిందని, నాడు మన దేశ నాయకత్వం తీసుకున్న చొరవను అభినందించాలని సోనియా పేర్కొన్నారు. పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ (పీఎల్ఓ)కు భారత్  మద్దతు ఇచ్చిందని గుర్తుచేశారు. అలాగే, అల్జీరియా స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో దక్షిణాఫ్రికాలో జాతివివక్ష సమస్యపైనా భారత్  గళమెత్తిందని తెలిపారు.

 అల్జీరియాకు స్వాతంత్ర్యం ఇవ్వాలని గట్టిగా డిమాండ్ చేసిన దేశాల్లో ఇండియా కూడా ఉందన్నారు. 1971లో బంగ్లాదేశ్‎ను కూడా స్వతంత్ర దేశంగా చేసిందన్నారు. ఇప్పుడు పాలస్తీనా పౌరుల హక్కులను కాపాడాలన్నారు. న్యాయం, గుర్తింపు, గౌరవం,  హక్కుల కోసం పోరాడుతున్న పాలస్తీనా విషయంలోనూ భారత్  చొరవ తీసుకోవాలని సోనియా హితవు పలికారు.