
రాయ్‌బరేలీ : “నా కొడుకు (రాహుల్‌గాంధీ)ను మీకు అప్పగిస్తున్నా.. మిమ్మల్ని ఎప్పటికీ నిరాశపర్చడు” అని రాయ్‌బరేలీ ప్రజలకు యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ చెప్పారు. తనను ఆదరించినట్టే తన కుమారుడిని కూడా అక్కున చేర్చుకోవాలని అభ్యర్థించారు. ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో శుక్రవారం రాహుల్‌గాంధీ తరఫున సోనియాగాంధీ తొలిసారి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆమెతోపాటు కొడుకు రాహుల్ గాంధీ, కూతురు ప్రియాంకగాంధీ ఉన్నారు. ఈ సందర్భంగా సోనియాగాంధీ మాట్లాడుతూ.. ఇందిరాగాంధీ, రాయ్‌బరేలీ ప్రజల ద్వారా తాను నేర్చుకున్న పాఠాలనే రాహుల్‌కు, ప్రియాంకకు చెప్పానని అన్నారు.
‘‘చాలారోజుల తర్వాత మీ ముందుకు రావడం సంతోషంగా ఉంది. 20 ఏండ్లు ఎంపీగా పనిచేసే అవకాశం నాకు కల్పించారు. అందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇది నా జీవితంలో సంపాదించుకున్న గొప్ప ఆస్తి” అని సోనియా గాంధీ పేర్కొన్నారు.
రాయ్‌బరేలీ నా కుటుంబం.. అమేథీ నా ఇల్లు
రాయ్‌బరేలీ తన కుటుంబం అని, అలాగే, అమేథీ తన ఇల్లు అని సోనియాగాంధీ పేర్కొన్నారు. ‘‘గత వందేండ్లుగా నా కుటుంబం మూలాలు ఈ గడ్డతోనే పెనవేసుకున్నాయి. మన మధ్య బంధం గంగామాత అంత స్వచ్ఛమైనది. అవధ్, రాయ్‌బరేలీలో రైతు ఉద్యమం నుంచి ఈ అనుబంధం మొదలైంది.. ఇప్పటికీ కొనసాగుతున్నది” అని వ్యాఖ్యానించారు. కాగా, రాయ్‌బరేలీ నియోజకవర్గానికి సోనియాగాంధీ 2004 నుంచి వరుసగా నాలుగుసార్లు ప్రాతినిధ్యం వహించారు. ఈ సారి ఆమె రాజ్యసభనుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆమె తన స్థానంలో కొడుకు రాహుల్‌ను రాయ్‌బరేలీ నుంచి బరిలో నిలిపారు. ఇక్కడ ఐదో విడతలో మే 20న పోలింగ్ జరుగనున్నది.
అమేథీ, రాయ్‌బరేలీ నాకు రెండు కండ్లలెక్క: రాహుల్ గాంధీ
అమేథీ : రాయ్‌బరేలీ, అమేథీతో తన కుటుంబానికి ఎన్నో ఏండ్ల అనుబంధం ఉందని కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ చెప్పారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రెండింటిలో దేనినీ తక్కువగా చూడబోనని ఆయన హామీ ఇచ్చారు. అభివృద్ధి విషయంలో అమేథీ, రాయ్‌బరేలీని సమానంగా చూస్తానన్నారు. శుక్రవారం ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కేఎల్ శర్మకు మద్దతుగా నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో రాహుల్ మాట్లాడారు. రాయ్‌బరేలీ అభివృద్ధి పనులకు పది రూపాయలు కేటాయిస్తే, అమేథీకి కూడా అంతేమొత్తంలో నిధులు కేటాయిస్తామని చెప్పారు. తాను ఎన్నికల్లో ఎక్కడినుంచి పోటీ చేసినా అమేథీ ప్రజలతో తన అనుబంధం ఎప్పుడూ అలాగే ఉంటుందని రాహుల్ పేర్కొన్నారు.
మోదీ వస్తే రిజర్వేషన్లు రద్దయితయ్
దేశంలో కొద్దిమంది మాత్రమే ధనికులుగా, మిగతావాళ్లంతా పేదలుగా మిగిలిపోవాలని ప్రధాని మోదీ కోరుకుంటున్నారని రాహుల్ ఆరోపించారు. ఆయన మరోసారి గెలిస్తే రాజ్యాంగం అంతం అవుతుందన్నారు. అప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలు ఉండవన్నారు. ‘‘ఇంకోసారి బీజేపీ గెలిస్తే ద్రవ్యోల్బణం, ధరలు పెరుగుతయ్. రిజర్వేషన్లు రద్దు చేస్తరు. ప్రజల హక్కులన్నీ ఒక్కొక్కటిగా లాక్ అయితయ్. దేశంలో 20 నుంచి 25 మంది ధనవంతులు మాత్రమే మిగుల్తరు. వాళ్ల హక్కులు మాత్రం సేఫ్. రైతులు, యువకులు, తల్లీబిడ్డల హక్కులు హరించుకుపోతయ్” అని రాహుల్ ఆరోపించారు.