
కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేతగా ఆ పార్టీ మాజీ అధ్యక్షురాలు, రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ ఎంపికయ్యారు. 2024, జూన్ 8వ తేదీ శనివారం పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని జరిగింది. ఈ సమావేశానికి రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, శశి థరూర్, అజయ్ మాకెన్, కార్తీ చిదంబరం, పంజాబ్ మాజీ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ సహా పలువురు పార్టీ నేతలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా పార్టీ ఛైర్‌పర్సన్‌గా సోనియా గాంధీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మొదట ఆమె పేరును కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఆ తర్వాత నేతలు గౌరవ్ గొగోయ్, తారిఖ్ అన్వర్, కె సుధాకరన్ ప్రతిపాదించగా.. ఎంపీలు సమర్థించి తీర్మానం చేశారు. కాగా, ఈరోజు ఉదయం జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో రాహుల్ గాంధీని లోక్ సభ ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నుకోవాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. త్వరలో అధికారికంగా వెల్లడించనున్నట్లు కేసీ వేణుగోపాల్ వెల్లడించారు.