సిమ్లాలో సోనియా గాంధీ వ్యక్తిగత టూర్

సిమ్లాలో సోనియా గాంధీ వ్యక్తిగత టూర్
  • 3 రోజులపాటు  ప్రియాంక, రాబర్ట్ వధేరాలతో గడపనున్న సోనియా

సిమ్లా: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ 3 రోజులపాటు సిమ్లాలో గడపనున్నారు. పూర్తి వ్యక్తిగత పర్యటన కావడంతో పార్టీ వర్గాలకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. పంజాబ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పిడి వ్యవహారం పరిష్కారం కావడంతో సెదదీరేందుకు ఆమె కూతురు ప్రియాంక, అల్లుడు రాబర్ట్ వధేరా వద్దకు సిమ్లా వచ్చినట్లు తెలుస్తోంది. సోమవారం ఉదయమే ఆమె పంజాబ్ మరియు హర్యానా ఉమ్మడి రాజధాని చండీగఢ్ చేరుకున్నారు. అక్కడ నుండి ఆమె నేరుగా హిమాచల్ ప్రదేశ్ రాజధాని శివారులోని పైన్ మరియు దేవదారు అడవుల మధ్య ఉన్న తన కుమార్తె ప్రియాంకా గాంధీ వాద్రా కు చెందిన కాటేజీకి చేరుకున్నారు.

ప్రియాంక, రాబర్ట్ లు ఇప్పటికే సిమ్లాలో ఉంటుండగా.. రాహుల్ గాంధీ కూడా వచ్చి చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పంజాబ్ కొత్త సీఎం చరణ్ జిత్ సింగ్ ఛన్నీ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న రాహుల్ గాంధీ.. పార్టీ వర్గాలకు దిశానిర్దేశం చేసిన అనంతరం సిమ్లాకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  కుటుంబ సభ్యులందరితో కలసి గడిపేందుకే సోనియా సిమ్లాలో వ్యక్తిగత పర్యటనకు వచ్చారని పార్టీ వర్గాల కథనం. గత కొద్ది నెలలుగా పీటముడిపడి జఠిల సమస్యగా పరిణమించిన పంజాబ్ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ అంతర్గత సంక్షోభం పరిష్కారం కావడంతో సెదదీరేందుకు ఆమె సిమ్లాలో పర్యటిస్తున్నట్లు సమాచారం.