బీజేపీ, ఆర్ఎస్ఎస్ తో దేశంలో హింస, ద్వేషం పెరుగుతోంది

 బీజేపీ, ఆర్ఎస్ఎస్ తో   దేశంలో హింస, ద్వేషం పెరుగుతోంది

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఒక్కొక్కటిగా వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేస్తోందని కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్​ సోనియా గాంధీ విమర్శించారు. ఈ విషయాన్ని తమ పార్టీ ప్రజల్లోకి తీసుకెళుతుందని, భారత్​ జోడో యాత్రలోనూ అదే చేసిందని తెలిపారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం పాటుపడే పార్టీలతో కలిసి నడిచేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమని సోనియా స్పష్టంచేశారు. మంగళవారం ఓ జాతీయ మీడియాకు రాసిన వ్యాసంలో మోడీ సర్కారుపై ఆమె విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలైన శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలను కేంద్రం నిరుపయోగంగా మార్చేస్తోందని మండిపడ్డారు. కేంద్రం చర్యలతో ప్రజాస్వామ్యం తన విలువలు కోల్పోతోందన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ లీడర్ల కారణంగా దేశంలో హింస, ద్వేషం పెరుగుతోందని, దీన్ని చూస్తూ కూడా ప్రధాని మోడీ ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని ఆరోపించారు. మోడీ హయాంలో మతపరమైన పండుగలు బెదిరింపులకు ఆనవాళ్లుగా మారాయన్నారు. ప్రజలు మతం, ఆహారం, కులం, లింగం, భాష పేరుతో వివక్షకు గురవుతున్నారని ఆరోపించారు. 

ప్రజల దృష్టి మళ్లిస్తున్నరు..

దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు ప్రధాని మోడీ ప్రయత్నిస్తున్నారని సోనియా విమర్శించారు. మోడీ ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో వారు మౌనంగా ఉండబోరని అన్నారు. కీలక రాష్ట్రాలలో ఎన్నికలు సమీపిస్తున్నాయని, రాబోయే కొన్ని నెలలు దేశ ప్రజాస్వామ్యానికి ఎంతో కీలకమని చెప్పారు. ఈ సందర్భంగా కేంద్రం అధికార దుర్వినియోగానికి పాల్పడే అవకాశం ఉందన్నారు.  ప్రతిపక్షాలను ఎదుర్కోలేక పార్లమెంటులో ప్రసంగాలను బహిష్కరిస్తోందని బీజేపీపై సోనియా మండిపడ్డారు. ఎలాంటి చర్చ లేకుండానే 45 లక్షల కోట్ల బడ్జెట్‌‌‌‌‌‌‌‌ను ఆమోదించారని విమర్శించారు. అదానీ స్కామ్​పై నిలదీస్తే ప్రభుత్వం తట్టుకోవడంలేదన్నారు.

అవినీతిపై నిలదీస్తే కేసులు పెడ్తున్నరు

ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేసుకుని సీబీఐ, ఈడీలతో తప్పుడు కేసులు పెట్టిస్తున్నరని సోనియా మండిపడ్డారు. ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా 95% కేసులు నమోదయ్యా యని అన్నారు. బీజేపీలో చేరితే పెట్టిన కేసులన్నీ ఎత్తేసే పరిస్థితి ఉందని విమర్శించా రు. ప్రభుత్వంపై విమర్శలు చేసే విషయంలో సుప్రీం కోర్టు కూడా మార్గదర్శకాలు విడుదల చేసిందన్నారు. వాటిని కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, సోషల్ డివిజన్ గురించి నిర్మలా సీతారామన్​ తన బడ్జెట్​ ప్రసంగంలో ప్రస్తావించలేదని విమర్శించారు. దేశ సంపదను మోడీ తన మిత్రులకు దోచిపెడ్తూ.. సత్యం, న్యాయం గురించి మాట్లాడుతున్నారని సోనియా గాంధీ విమర్శించారు.